నో సెకండ థాట్!! హద్దు మీరితే చైనాపై కాల్పులే

నో సెకండ థాట్!! హద్దు మీరితే చైనాపై కాల్పులే

తూర్పు లడఖ్‌లో భారత క్యాంపులను ఆక్రమించాలని చూస్తే తమ బలగాలు కాల్పులకూ వెనుకాడబోవని ఇండియా.. చైనాకు స్పష్టంచేసింది. ఎల్‌ఏసీ పక్కగా ఇకపై కర్రలు, రాళ్లతో ఆటవిక పోరాటాలు ఉండబోవని తేల్చి చెప్పింది. పాంగాంగ్‌ సరస్సు వద్ద భారత్‌కు పట్టున్న దక్షిణ రేవు నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను మొదలుపెడదామన్న డ్రాగన్‌ ప్రతిపాదనను తిరస్కరించింది.




ఉద్రిక్తత నెలకొన్న అన్ని చోట్లా ఏకకాలంలో ఈ ప్రక్రియ సాగాల్సిందేనని స్పష్టంచేసినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇటీవల జరిగిన సైనిక కోర్‌ కమాండర్ల స్థాయి చర్చల్లో ఈ అంశాలపై భారత్‌ తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు వివరించాయి. భారత క్యాంపులను ఆక్రమించడానికి ఆయుధాలతో సామూహిక దాడులకు చైనా ప్రయత్నిస్తే కాల్పులు జరపాలని భారత బలగాలకు ఆదేశాలు అందాయి. ఇదే విషయాన్ని డ్రాగన్‌ సేనకు తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

‘సరిహద్దుల్లో బలగాల పరస్పర తోపులాటలను ఇక సహించబోమన్న సందేశాన్ని చేరవేశాం. ఆటవిక ఆయుధాల వినియోగమూ కుదరదని తేల్చేశాం’ అని వివరించాయి. పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ రేవుల్లో ఇప్పటికే పలుమార్లు గాల్లోకి కాల్పులు జరుపుకొన్న ఘటనలు జరిగాయని గుర్తు చేశాయి. ఇందులో చిన్నపాటి ఆయుధాలను మాత్రమే ఉపయోగించారని, భారీ ఆయుధాలు లాంటివి వాడలేదని తెలిపాయి.




జూన్‌ 15న గాల్వాన్‌ లోయలో ఇరు దేశాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక మంది చైనా సైనికులు చనిపోయారని అధికార వర్గాలు చెప్పాయి. ‘సరిహద్దుల రక్షణకు ఎంతకైనా సిద్ధమనే సిగ్నల్‌ను ఈ చర్య ద్వారా చైనాకు తెలియజేశాం. ఈ ఘర్షణలో బెటాలియన్‌ కమాండర్‌ సహా కనీసం ఐదుగురు సైనికులు చనిపోయినట్లు దౌత్య చర్చల్లో చైనా అధికారులు అంగీకరించారు. వాస్తవానికి చైనా తరపున ప్రాణనష్టం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండొచ్చు’ అని ఓ అధికారి తెలిపారు.

సరిహద్దుల్లో బలగాలను పెంచరాదంటూ కుదిరిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా మాటలను గుడ్డిగా నమ్మబోమని, అప్రమత్తతను కొనసాగిస్తామని తెలిపారు. ఆ దేశం విశ్వాసఘాతుకానికి పాల్పడ్డ ఉదంతాలు అనేకం ఉన్నాయని వివరించారు.