యాప్స్ బ్యాన్ తర్వాత మోడీ నెక్ట్స్ టార్గెట్, చైనీస్ 5G పరికరాలపై నిషేధం

  • Published By: sreehari ,Published On : July 28, 2020 / 03:26 PM IST
యాప్స్ బ్యాన్ తర్వాత మోడీ నెక్ట్స్ టార్గెట్, చైనీస్ 5G పరికరాలపై నిషేధం

చైనా దురాక్రమణ, దుందుడుకుతనాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యాప్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం.. చైనీస్ 5జీ పరికరాలను కూడా బ్యాన్‌ చేసే ఆలోచనలో ఉంది. వాస్తవంగా మార్చిలోనే 5జీ స్పెక్ట్రమ్‌ వేలం జరగాలి. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పుడది కనీసం ఏడాది వరకు వాయిదా పడింది. వొడాఫోన్‌, ఐడియా లాంటి టెలికాం సంస్థల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటమూ మరో కారణంగా కనిపిస్తోంది.

మరోవైపు అమెరికా ఇప్పటికే హువావేపై నిషేధం విధించింది. ఆ సంస్థ అధినేతకు చైనా కమ్యూనిస్టు పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హువావేపై మరికొన్ని ఆరోపణలు రావడంతో డొనాల్డ్‌ ట్రంప్‌ దానిని నిషేధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్‌, భారత్‌ సైతం ఇలాంటి చర్యలే తీసుకోవాలని అమెరికా కోరింది. అయితే 4జీకి సంబంధించి చైనా పరికరాలు వాడొద్దని బీసీసీఐకి ఇంతకు ముందే కేంద్రం ఆదేశాలిచ్చింది. 5జీ పరికరాలను నిషేధిస్తే ప్రైవేటు ఆపరేటర్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో డైలామాలో పడింది.

అందుకే భారత్ వెనక్కి తగ్గిందా? :
యావత్ ప్రపంచానికి 5జీ సాంకేతికతను అందించేందుకు చైనా కంపెనీ హువా వే సిద్ధంగా ఉంది. కానీ చాలా దేశాలు ఆ కంపెనీ ఉత్పాదనలపై నిషేధం విధిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం హువావే పై విధించిన నిషేధం పెను ప్రకంపనలు సృష్టించింది. భారత్ చైనా యాప్స్‌ బ్యాన్ క్రమంలో గూగుల్, ఆండ్రాయిడ్, ఇంటెల్ లాంటి మరెన్నో కంపెనీలు హువా వేతో తమ అనుబంధాన్ని తెంచేసుకున్నాయి.

హువా వే వివిధ దేశాలు నిషేధాలు, ఆంక్షలు ప్రకటించడం కొత్తేమీ కాదు. అయినా కూడా భారత్ తో సహా పలు దేశాలు హువా వే పై నిషేధం వేటు వేయలేకపోయాయి. ఇందుకు ప్రధాన కారణం 5జీ టెక్నాలజీని ఆ కంపెనీ అత్యంత చౌకధరలకు అందించడమే. అలా అని చెప్పి దేశభద్రతను పణంగా పెట్టగలమా అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. దీంతో హువావే కంపెనీతో ఒప్పందం చేసుకునే విషయంలో భారత్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

హువావేపై ఐదు దేశాలు కన్నెర్ర :
హువా వేతో అగ్రరాజ్యాల తగాదాలు కొత్తేం కాదు. ఫైవ్ ఐస్ పేరిట కూటమిగా ఉన్న ఐదు దేశాలు మొదటి నుంచి కూడా చైనా కంపెనీల ఉపకరణాల గూఢచర్యంపై కన్నెర్ర చేస్తూనే ఉన్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్, బ్రిటన్, అమెరికా ఈ కూటమిలో భాగంగా ఉన్నాయి. కూటమిలోని ఒక్కో దేశం హువావే పై వేటు వేస్తూ వచ్చింది.

ఈ మధ్య అమెరికా వంతు వచ్చింది. పౌరహక్కుల అణచివేత, ఆంక్షలు విధించిన దేశాలకు టెక్నాలజీ సరఫరా, చైనా ప్రభుత్వం తరఫున గూఢచర్యం లాంటి సాకులు ఉన్నాయి. దేశీయంగా తమ కంపెనీలను లేదంటే మిత్రరాజ్యాల కంపెనీలను ప్రోత్సహించాలనే స్వీయప్రయోజన అజెండాలూ ఉన్నాయి. ఇక హువా వే పై నిషేధం విషయానికి వస్తే 2018 ఆగస్టులోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం హువావే ను తమ 5జీ కార్యక్రమంలో నిషేధించింది.

హువా వే పేరును ప్రత్యేకంగా ప్రకటించకపోయినప్పటికీ, విదేశీ ప్రభుత్వం నుంచి న్యాయబద్ధం కాని ఆదేశాలు పొందే కంపెనీలు తమ దేశంలో 5జీ టెక్నాలజీని అందించేందుకు వీల్లేదని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా విధించిన ఆ నిషేధం హువా వే పైనే అనే విషయం క్లియర్‌ కట్‌గా అర్థమవుతోంది.

ఆస్ట్రేలియా అడుగుజాడల్లోనే న్యూజీలాండ్ :
న్యూజీలాండ్ కూడా ఆస్ట్రేలియా అడుగుజాడల్లోనే నడిచింది. 5జీ సాంకేతికతను అందించేందుకు తాము హువా వే ఉపకరణాలను వినియోగిస్తామని స్పార్క్ అనే మొబైల్ కంపెనీ న్యూజీలాండ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఆ అభ్యర్థనను న్యూజీలాండ్ ప్రభుత్వం తిరస్కరించింది. హువా వే ను నిషేధించాల్సిందిగా బ్రిటన్ ఎప్పటి నుంచో కోరుతోంది.

బ్రిటన్ ఇప్పటి వరకూ నేరుగా హువా వే ను నిషేధించకపోయినా, ఆ కంపెనీపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వాదిస్తోంది. హువా వే కంపెనీ అనుమానస్పద రీతిలో వ్యవహరించింది అనేందుకు ఆధారాలు లేనప్పటికీ, కీలక మౌలిక వసతుల కల్పనలో చైనా కంపెనీల ప్రమేయాన్ని బ్రిటన్ వ్యతిరేకిస్తోంది.

కెనడా విషయానికి వస్తే అక్కడ 5జీ నెట్ వర్క్ లో చైనా కంపెనీల ప్రమేయం వద్దంటూ అమెరికా తీవ్ర ఒత్తిడి తీసుకువస్తోంది. ఇక జర్మనీ ఇప్పటికే హువా వే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా భవిష్యత్తుపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఇక జపాన్ సైతం హువా వే ఉత్పాదనల కొనుగోలుపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. హువావే ఉపకరణాలను వినియోగిస్తే…. వాటిని గూఢచర్యానికి చైనా ప్రభుత్వం ఉపయోగించుకునే వీలుందని పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ ఆందోళనతోనే అవి హువా వే ఉపకరణాలపై నిషేధం విధిస్తున్నాయి.

కరోనా మహమ్మారితోపాటు చాలా విషయాల్లో చాలా దేశాలు చైనాపై ఆగ్రహంగా ఉన్నాయి. అందుకే దౌత్య, ఆర్థిక, వ్యాపార సంబంధాలకు దూరంగా ఉంటున్నాయి. అయితే భారత్‌ మాత్రం యాప్‌లు నిషేధిస్తుండడంతో చైనా అల్లాడిపోతోంది. ఉద్రిక్తతల మధ్యే కీలక నిర్ణయాలు తీసుకోవడాన్ని డ్రాగన్ జీర్ణించు కోలేకపోతోంది.

చైనాకు చెందిన యాప్ లను ఓ దేశం నిషేధించటం బహుశా ఇదే మొదటిసారి. అందుకే దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది చైనా. పలు యాప్స్‌పై నిషేధం అమల్లోకి రావటంతో వాటిద్వారా వచ్చే ఆదాయానికి భారీగా గండి పడటంతో జిన్ పింగ్ సర్కార్ అయోమయంలో పడింది.