పాక్ ప్రధాని ఆరోపణలపై స్పందించిన భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2020 / 07:30 AM IST
పాక్ ప్రధాని ఆరోపణలపై స్పందించిన భారత్

అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్న తరుణంలో వారందరికీ ఆదర్శంగా నిలిచేలా కరోనాను కట్టడి చేస్తున్న భారత్ పై పాక్ విషం చిమ్ముతూనే ఉంది. మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేస్తూ తన నీచ స్వభావాన్ని మరోసారి పాక్ ప్రదర్శించింది.  

కరోనా సమయంలో భారత ప్రభుత్వం ముస్లింలను టార్గెట్ చేస్తుందంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. ఢిల్లీ మర్కజ్ ఘటన అనంతరం దేశంలో కరోనా కేసులు ఎక్కువైన విషయం తెలిసిందే. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 29.8శాతం మర్కజ్ కేసులేనన్న విషయం తెలిపిందే.

అయితే, ముస్లింలపై ఉద్దేశ్యపూర్వకంగా భారతప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఆదివారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేశారు. ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. వాళ్ల దేశంలో ఉన్న అంతర్గత విషయాలను పక్కకు తోసేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు పాక్ చేస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు.

కరోనాపై దృష్టి పెట్టాల్సిందిపోయి, తోటి దేశంపై పాక్ నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. పాకిస్తాన్ ఏ స్థాయిలో మైనారిటీలపై వివక్ష ప్రదర్శిస్తున్నదో తెలుసంటూ పాక్‌కు చురకలు అంటించారు.