Ashwagandha : కరోనా రోగులకు అశ్వగంధ ఔషధం.. బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్

మన దేశంలో లభించే ఆయుర్వేద ఔషధం అశ్వగంధ. దీని నుంచి తయారుచేసిన ఔషధంతో ఎంతోమంది కరోనా రోగులు ప్రయోజనం పొందినట్టు అధ్యయనాల్లో రుజువైంది. ఈ క్రమంలో ఇప్పుడు..

Ashwagandha : కరోనా రోగులకు అశ్వగంధ ఔషధం.. బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్

Ashwagandha

Ashwagandha For Covid Recovery : మన దేశంలో లభించే ఆయుర్వేద ఔషధం అశ్వగంధ. దీని నుంచి తయారుచేసిన ఔషధంతో ఎంతోమంది కరోనా రోగులు ప్రయోజనం పొందినట్టు అధ్యయనాల్లో రుజువైంది. ఈ క్రమంలో ఇప్పుడు తొలిసారిగా దేశం బయట కొవిడ్‌ రోగులకు అశ్వగంధ ఔషధం ఇచ్చి అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం భారత్-బ్రిటన్ మధ్య ఒప్పందం కుదిరింది. త్వరలో బ్రిటన్ లోని మూడు నగరాల్లో అశ్వగంధపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

16 నెలల పాటు దాదాపు 100 సార్లు సమావేశమైన తర్వాత ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ), లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్.. మూడు బ్రిటన్‌ నగరాల్లో పోస్ట్ కొవిడ్ రోగులపై ఈ ఔషధాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించాయి.

అశ్వగంధను ఇండియన్ వింటర్ చెర్రీగా పిలుస్తారు. దీని వాడకం వల్ల శక్తి వస్తుందని, ఒత్తిడి తగ్గుతుందని, రోగనిరోధక వ్యవస్ద మెరుగుపడుతుందని పలు పరిశోధనల్లో తేలింది. దీంతో అశ్వగంధను కోవిడ్ రోగులపైనా ప్రయోగించడం ద్వారా వారి రోగనిరోధక శక్తి పెరుగుదలను పరీక్షించాలని ఆయుష్ మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఇందుకోసం కోవిడ్ బాధిత దేశాల్లో ఒకటైన యూకేతో కలిసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మొత్తం రెండు
వేల మందిని రెండు వర్గాలుగా విభజించి వారికి అశ్వగంధ ఔషధం ఇవ్వనున్నారు. ఆ తర్వాత వారిలో వచ్చే మార్పులు గమనించి ఫలితాలను విశ్లేషిస్తారు.

లీసెస్టర్, బర్మింగ్‌హామ్, లండన్‌ నగరాల్లోని 2వేల మంది పోస్ట్, లాంగ్ కొవిడ్ రోగులపై అధ్యయనం జరుగుతుందని ఏఐఐఏ డైరెక్టర్, ప్రాజెక్ట్‌కో-ఇన్వెస్టిగేటర్ డాక్టర్ తనూజ మనోజ్ నేసరి తెలిపారు. మన దేశంలో జరిపిన అనేక పరీక్షల్లో అశ్వగంధ ప్రభావవంతంగా పని చేస్తున్నట్టు తేలింది. కొవిడ్‌-19 దీర్ఘకాలిక లక్షణాలను తగ్గించడానికి అశ్వగంధ సరైన చికిత్సా ఎంపికని ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు నిరూపించాయి.