కదిలింది నౌక.. 25మంది భారతీయులే.. కోట్లలో నష్టం

మార్చి 23 నుండి ఈజిప్టులోని సూయజ్ కాలువలో ఇరుక్కొని ట్రాఫిక్ జామ్‌కు కార‌ణ‌మైన ఎవ‌ర్‌ గివెన్ కంటైన‌ర్ షిప్ ఇవాళ(29 మార్చి 2021) పూర్తిగా కదిలే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. నిన్న కాస్త కదిలిన షిప్‌ను మరింత కదిలించేందుకు సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారు.

కదిలింది నౌక.. 25మంది భారతీయులే.. కోట్లలో నష్టం

Indian Crew In Ship

Indian crew in Ship: మార్చి 23 నుండి ఈజిప్టులోని సూయజ్ కాలువలో ఇరుక్కొని ట్రాఫిక్ జామ్‌కు కార‌ణ‌మైన ఎవ‌ర్‌ గివెన్ కంటైన‌ర్ షిప్ ఇవాళ(29 మార్చి 2021) పూర్తిగా కదిలే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. నిన్న కాస్త కదిలిన షిప్‌ను మరింత కదిలించేందుకు సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారు. మెగా షిప్‌ను కదిలించడం కోసం దీని చుట్టూ ఉన్న ఇసుకను సిబ్బంది తవ్వితీస్తున్నారు. 400 మీట‌ర్ల పొడువున్న ఈ ఎవ‌ర్ గివెన్ షిప్ సుయెజ్ కాలువ‌లో వెళ్తూ భారీ గాలుల‌కు ప‌క్కకు తిరిగింది. దీంతో ప‌క్కనే ఉన్న ఇసుక‌లో షిప్ కూరుకుపోయింది. .

ఈ ఘటనతో వంద‌లాది నౌక‌లు ఎక్కడిక‌క్కడ ఆగిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐదు రోజులుగా షిప్‌ను తిరిగి కాలువలోకి చేర్చే పనులు కొనసాగుతున్నాయి. ఇసుక‌ను త‌వ్వడం, ట‌గ్ బోట్ల సాయంతో నౌక‌ను లాగ‌డం, నెట్టడం చేస్తున్నారు. ఇప్పుడీ ప్రయత్నాల వల్ల ఆ భారీ షిప్‌లో కాస్త క‌ద‌లిక క‌నిపించింది. ప్రస్తుతం షిప్ కింద నుంచి నీళ్లు ప్రవ‌హిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఏ స‌మ‌యంలో అయినా ఆ షిప్ నీళ్లపై తేలే అవకాశం ఉందని అంటున్నారు.

సుయెజ్ కాలువ‌లో ఇరుక్కున్న ఈ షిప్ ముందు భాగంలో ఇప్పటికే 20 వేల ట‌న్నుల ఇసుక‌ను తవ్వారు. నెద‌ర్లాండ్స్‌కు చెందిన బొస్కాలిస్ సంస్థకు చెందిన భారీ ట‌గ్ బోట్లను ఈ షిప్‌ను నెట్టడానికి, లాగ‌డానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే 321 నౌక‌లు సుయెజ్ కాలువ‌లో ప్రయాణించ‌డానికి వేచి చూస్తున్నాయి. ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం గుండా వెళ్లే షిప్‌ల రవాణాకు ఆటంకం కలగగా.. ఎవర్ గివెన్ నౌకను నిర్వహిస్తున్న బెర్న్‌హార్డ్ షుల్జ్ షిప్ మేనేజ్‌మెంట్ లేటెస్ట్‌గా ఓ ప్రకటన చేసింది.

ఈ నౌకలో ఉన్న 25 మంది సిబ్బంది భారతీయులేనని, వారు సురక్షితంగా ఉన్నట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. భారతీయ సిబ్బందితోపాటు ఈ నౌకలో ఈజిప్టు కెనాల్‌కు చెందిన ఇద్దరు పైలట్లు ఉన్నారని, షిప్ అడ్డం తిరిగినప్పుడు వీరే నౌకను నడుపుతున్నట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ షిప్ కారణంగా కోట్లలో నష్టం వచ్చినట్లుగా వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.