యూఎస్ క్యాపిటల్ ఎటాక్ లో భారతీయ జెండా..వీడియో వైరల్

యూఎస్ క్యాపిటల్ ఎటాక్ లో భారతీయ జెండా..వీడియో వైరల్

Indian Flag Spotted At US Capitol Attack రెండు నెలల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రిటిక్ నేత జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు ఇవాళ యూఎస్‌ కాంగ్రెస్‌(అమెరికా పార్లమెంట్) సమావేశం కావడంతో ట్రంప్ మద్దతుదారులు రెచ్చిపోయారు. బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు నినాదాలు చేపట్టారు. వాషింగ్టన్ లోని అమెరికా క్యాపిటల్ హిల్ బిల్డింగ్‌(పార్లమెంట్ భవనం)పై ట్రంప్ మ‌ద్ద‌తుదారులు దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ క్రమంలో జరిగిన హింసలో నలుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. 50 మందికిపైగా అరెస్ట్ చేశారు. లైసెన్సు లేని నిషేధిత ఆయుధాలతోపాటు రిపబ్లికన్‌, డెమోక్రటిక్ నేషనల్ కమిటీ హెడ్‌క్వార్టర్ల వద్ద రెండు పైప్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ట్రంప్ చేసిన తిరుగుబాటుగా చాలా మంది అభివ‌ర్ణించారు. అసలు ట్రంప్ అభిమానులు ఎలా క్యాపిటల్ హిల్‌లోకి వచ్చారు, ఎలా వాళ్లంతా బయటకు స్వేచ్ఛగా వెళ్లిపోయారనే దానిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కాగా,ఈ నిర‌స‌న‌ల్లో ఒక వీడియో ఇప్పుడు ఇండియ‌న్స్‌ను ఆక‌ర్షించింది. ఆ వీడియోలో ఓ వ్య‌క్తి భార‌త త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ప‌ట్టుకొని కనిపించ‌డం గ‌మ‌నార్హం. అయితే ఆ వ్య‌క్తి ఎవ‌రు? అత‌డు ఏ పార్టీకి చెందిన‌వాడ‌న్న దానిపై ఇంకా ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. కానీ అమెరికా ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు వ్య‌తిరేకంగా ఇంత పెద్ద ఎత్తున జ‌రుగుతున్న నిర‌స‌న కార్య‌క్ర‌మంలో త్రివర్ణ పతాకం క‌నిపించడానికి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ.. అక్క‌డ మ‌న జెండా ఎందుకు ఉందంటూ ప్ర‌శ్నించారు. ఈ పోరాటంలో మ‌నం పాలుపంచుకోవాల్సిన అవ‌స‌రం అస‌లే లేదంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.