అమెరికాకు ఇండియన్ స్టూడెంట్స్ ఏడాదికి ఎంత ఇచ్చారంటే?

  • Published By: vamsi ,Published On : November 17, 2020 / 09:25 PM IST
అమెరికాకు ఇండియన్ స్టూడెంట్స్ ఏడాదికి ఎంత ఇచ్చారంటే?

Indian students contributed USD 7.6 billion: విదేశాలలో చదువుల కోసం పరితపించే భారతీయ విద్యార్ధుల సంఖ్య మాములుగానే ఎక్కువే. అందులోనూ అమెరికాలో చదువుకోవాలని భావించే విద్యార్ధుల సంఖ్య ఇంకా ఎక్కువ. మొత్తం భారతీయ విద్యార్థుల సంఖ్యలో 4.4 శాతం తగ్గినప్పటికీ, 2019-20 విద్యా సంవత్సరంలో భారత విద్యార్థులు అమెరికన్ ఆర్థికవ్యవస్థకు 7.6 బిలియన్ డాలర్లను అందించారు. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల అతిపెద్ద వనరుగా చైనా నిలిచింది. అమెరికాలో చైనా విద్యార్థుల సంఖ్య వరుసగా 16వ సంవత్సరం పెరిగినట్లుగా ‘‘ ఓపెన్‌ డోర్స్ 2020’’ నివేదిక వెల్లడించింది. 2019-20 సంవత్సరంలో అమెరికాలో 372,000 మంది చైనా విద్యార్థులు ఉన్నట్లుగా నివేదిక చెప్పింది.



ఇదే సమయంలో భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్య 4.4 శాతం తగ్గి 1,93,124 మంది మాత్రమే అమెరికాకు వెళ్లినా భారతీయ విద్యార్థుల ద్వారా 7.69 బిలియన్‌ డాలర్లు(రూ.57వేల కోట్లు) వచ్చినట్లుగా అమెరికా ఆర్థిక శాఖ వెల్లడించింది. అమెరికాకు భారత్ అంతర్జాతీయ విద్యార్థుల రెండవ అతిపెద్ద వనరుగా నిలిచింది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్ మరియు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(IIE) విడుదల చేసిన నివేదిక ప్రకారం, వరుసగా ఐదవ సంవత్సరం అమెరికా ఒక విద్యా సంవత్సరంలో ఒక మిలియన్‌కు పైగా అంతర్జాతీయ విద్యార్థులకు(1,075,496) ఆతిథ్యం ఇచ్చింది.



2019-20 విద్యా సంవత్సరంలో అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో స్వల్ప క్షీణత(1.8 శాతం) ఉన్నప్పటికీ, ఈ గ్రూపు ఇప్పటికీ అమెరికన్ ఉన్నత విద్యావ్యవస్థలోని విద్యార్థులందరిలో 5.5 శాతం ప్రాతినిధ్యం వహిస్తుంది. అమెరికా వాణిజ్య విభాగం ప్రకారం, 2019లో అంతర్జాతీయ విద్యార్థులు 44బిలియన్ డాలర్లను అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు అందించారు. ఇందులో భారతీయ విద్యార్థుల నుండి 7.69 బిలియన్ డాలర్లు వచ్చాయి.