ట్రంప్ సమక్షంలో భారత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అమెరికా పౌర‌స‌త్వం

  • Published By: venkaiahnaidu ,Published On : August 26, 2020 / 06:48 PM IST
ట్రంప్ సమక్షంలో భారత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అమెరికా పౌర‌స‌త్వం

ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ట్రంప్ చేతుల మీదుగా అమెరికా పౌరసత్వం దక్కింది. అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్ హౌస్ ఈ అరుదైన ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. నవంబర్ లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో విదేశీ ఓటర్లపై అధ్యక్షుడు ట్రంప్ దృష్టి కేంద్రీకరించారు.

ఈ నేపథ్యంలో ఐదు దేశాలకు(భారత్, బొలీవియా, లెబనాన్, సూడాన్, ఘనా) చెందిన పౌరులకు అమెరికా పౌరసత్వాన్ని అందజేసే కార్యక్రమాన్ని ట్రంప్ చేతులమీదుగా వైట్ హౌస్ లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఆ ఐదుగురిలో భారత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ సుధా సుందరి నారాయణన్ కూడా ఉన్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి భార‌తీయ సాఫ్ట్‌వేర్.. సుధా సుంద‌రి నారాయ‌ణ్ భార‌త సాంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ అయిన చీర‌క‌ట్టులో హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వేర్వేరు దేశాల‌కు చెందిన‌ మిగ‌తా న‌లుగురితో క‌లిసి అమెరికా పౌరురాలిగా ప్రమాణం చేశారు.కుడి చేతిని పైకి ఎత్తి చూపుతూ, మరో చేత్తో అమెరికా జెండాను పట్టుకుని, తాము అమెరికా పౌరులమని సంప్రదాయ ప్రమాణాన్ని చేశారు. ట్రంప్ పక్కనే నిలబడి ఉండగా.. హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం కార్యదర్శి చాద్ వోల్ఫ్ వారితో ప్రమాణం చేయించారు.

ఐదుగురు అసాధారణ వ్యక్తులను గొప్ప దేశమైన అమెరికా తన కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తోంది… ఇప్పుడు దేవభూమి పౌరులుగా గుర్తింపు పొందిన వారికి శుభాకాంక్షలని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొత్తగా అమెరికా పౌరసత్వం స్వీకరించిన పౌరులు.. దేశ చరిత్రను తెలుసుకుని, నిబంధనలు పాటించి, చట్టాలకు అతీతులై ఉండాలని సూచించారు. దేశాన్ని, రంగును, మతాన్ని అమెరికా చూడబోదని చెప్పడానికి ఇంతకన్నా మంచి నిదర్శనం లేదని అన్నారు

భారత్‌లో జన్మించి, 13 ఏళ్ల కిందట అమెరికాకు వచ్చిన సుధ నారాయణన్.. ఇప్పటికే తన వృత్తిపరమైన జీవితం అద్భుతమైన విజయాలను సాధించారని కొనియాడారు. కొత్తగా అమెరికా పౌరసత్వం స్వీకరించిన పౌరులు.. దేశ చరిత్రను తెలుసుకుని, నిబంధనలు పాటించి, చట్టాలకు అతీతులై ఉండాలని ట్రంప్ సూచించారు.