కష్టాలను ఎదురీదిన ధీర..యూట్యూబ్‌ సెన్సేషన్ గంగవ్వ..

కష్టాలను ఎదురీదిన ధీర..యూట్యూబ్‌ సెన్సేషన్ గంగవ్వ..

Women’s Day Special Gangavva :  పెళ్లి అంటే ఏంటో తెలియని అమయాకపు వయస్సులో పెళ్లి..వదిలేసి గల్ఫ్ బాట పట్టిన భర్త.. మోయలేని కుటుంబ భారం.. పిల్లల్ని సాకాలంటే తప్పక చేయాల్సిన కూలీ పని. కష్టాల మీద కష్టాలు. ఇంతలోనే భర్త చనిపోయాడు. అయినా కుంగిపోలేదు. కష్టాలను ఎదురీదింది. కష్టమొచ్చినా..సుఖమొచ్చినా కాలం ఆగదుగా..పరిగెడుతూనే ఉంటుంది. అలా 60 ఏళ్లు ఆమెను దాటేశాయ్. ఆ తర్వాతే.. ఆవిడ అసలు కథ ప్రారంభమైంది. యూట్యూబ్ సెన్సేషన్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఆమెను గుర్తుపట్టని వాళ్లెవరూ ఉండరు. ఆవిడే.. యూట్యూబ్ సెన్సేషన్ గంగవ్వ. బిగ్ బాస్ 4లో పాటిస్పేట్ చేసిన మహిళ..

గంగవ్వ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కొత్తగా ఏదైనా సాధించే వయసు కాదు ఆమెది. కానీ ఏదైనా సాధించటానికి వయస్సుతో పనిలేదని నిరూపించిన ధీర ఆమె. జీవితంలో ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడింది.ఇక ఆమెను ఏ కష్టం ఏమీ చేయలేదనే స్థాయికి వచ్చింది. 60 ఏళ్ల జీవితంలో ఎన్నో కోల్పోయింది. కానీ..ఏనాడు కుంగిపోలేదు. పోరాడటం ఆపలేదు. రెక్కల కష్టాన్ని నమ్ముకొని.. తన మెతుకు తానే సంపాదించుకొని కష్టాల్లో ఉన్నవారికి స్ఫూర్తిగా నిలిచింది. కాలంతో పాటు నడుస్తూన్న ఆమెకు స్వర్ణయం మొదలైందా అన్నట్లుగా సెస్సేషన్ అయిపోయింది. సరాదాగా గంగవ్వ చేసిన ఓ పని.. ఆమెను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొదట్లో సరదాగా చేసినా.. ఆ తర్వాత దానిని నిలుపుకోవడంలోనే గంగవ్వ గొప్పతనం అర్థమవుతుంది. ఆమె సమర్ధత దాగుంది.

జగిత్యాల జిల్లాలోని లంబాడిపల్లి గంగవ్వ సొంతూరు. ఒకటో తరగతి చదివింది. కానీ కష్టాలు అనుభవించటంతో వాటిని అధిగమించటంతో ఆమె పీహెచ్ డీలే చేసింది. తెలిసీ తెలియని.. ఐదేళ్ల వయసులోనే గంగవ్వకు పెళ్లి జరిగింది. పెళ్లి అంటే ఏంటో తెలియని వయస్సులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. కొన్నేళ్ల పాటు గల్ఫ్‌కు వెళ్లిన భర్త.. 13 ఏళ్ల క్రితం చనిపోయాడు. తర్వాత వ్యవసాయ కూలీగా పనిచేస్తూ.. పిల్లల పోషణ భారాన్ని మోసింది. వారిని పెంచి.. పెద్ద చేసి.. తన రెక్కల కష్టంతోనే అందరి పెళ్లిళ్లు చేసింది.

ఊళ్లో ఉంటూ.. వ్యవసాయ పనులతో పాటు పొగాకు చుట్టలు చుట్టే కార్మికురాలిగా పనిచేసేది. అలా.. 2016లో గంగవ్వ యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రామీణ ప్రజల జీవన విధానమే మెయిన్ థీమ్‌గా వచ్చిన ఆ యూట్యూబ్ చానల్‌లో.. గంగవ్వతో యాక్టింగ్ చేయించారు. ఆమెతో తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాయి. దీంతో.. గంగవ్వ యూట్యూబ్‌గా స్టార్‌గా మారిపోయింది. 2017 నుంచి.. గంగవ్వ పూర్తిస్థాయిలో యూట్యూబ్ వీడియోల్లో నటించడం మొదలుపెట్టింది.

గంగవ్వకు అంతకుముందు నటన అంటే ఏంటో కూడా తెలియదు. ఏ యాక్టింగ్ స్కూల్‌లోనూ ట్రైనింగ్ తీసుకోలేదు.కానీ.. ఆవిడ చేసేదంతా నేచురల్ యాక్టింగ్. చదువు లేకపోయినా..చెప్పింది విని డైలాగ్‌లు విని.. గుర్తుపెట్టుకొని మరీ.. పొల్లు పోకుండా చెప్పేస్తుంది. ఆవిడ నటనలో సహజత్వం కనిపిస్తుంది. అలా.. యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారాక.. గంగవ్వ సినిమాల్లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది.

గంగవ్వ మాట్లాడే తెలంగాణ యాసకు.. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ఆమెకు ఫిదా అయిపోయారు. దీంతో.. 2019లో గంగవ్వ తొలిసారి మల్లేశం సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది. తర్వాత చాలా చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇవన్నీ పక్కనబెడితే.. తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన బిగ్ బాస్ షోలోనూ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకుల మనసు గెలిచింది గంగవ్వ.

గంగవ్వలో ఎంతో టాలెంట్ ఉంది. కానీ.. అది బయటపడటానికి చాలా సమయం పట్టింది. 60 ఏళ్లు దాటాక ఆమెకు ఊహించని సక్సెస్ వచ్చింది. కానీ.. అప్పటిదాకా గంగవ్వ ఓర్పుగా వెయిట్ చేసింది. కష్టాలు వచ్చాయని కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగింది. ఆత్మస్థైర్యంతో మరింత ముందుకు వెళ్తోంది. నేటి తరం మహిళలకు.. ఆదర్శంగా నిలుస్తోందీ ధీర.