పచ్చదనాన్ని పెంచిన ఆడపుట్టుకలు : ఆ ఊర్లో ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటుతారు

పచ్చదనాన్ని పెంచిన ఆడపుట్టుకలు : ఆ ఊర్లో ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటుతారు

Little Girl is Born in Rajasthan:ఆడపిల్ల పుడితే అరిష్టమనీ..నష్టమని కొంతమంది అనుకుంటుంటే..పలు ప్రాంతాల్లో మాత్రం ఆడపిల్ల పుడితే పండుగే చేసుకుంటున్నారు. కొంతమంది ఆడపిల్ల పుడితే ఉచితంగా వైద్యంచేస్తామంటున్నారు.అటువంటి మరో ఆదర్శ గ్రామం రాజస్థాన్ లోని పింప్లాంటి గ్రామం. ఆ గ్రామంలో ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుట్టినా ఆ పాప తల్లిదండ్రులు 111 మొక్కలు నాటుతారు. అలా ఆడపిల్ల పుట్టిన ప్రతీసారీ 111 మొక్కలు నాటుతారు. దీంతో ఆ గ్రామమే కాదు ఆ చుట్టుపక్కల అంతా పచ్చదనంతో కళకళలాడుతుంటుంది. వనదేవతే కొలువు తీరిందా అన్నట్లుగా ఉంటుంది పింప్లాటి గ్రామం. కేవలం మొక్కుబడిగా మొక్కలు నాటి ఊరుకోరు. అవి బతికి చక్కగా ఏపుగా పెరిగేవరకూ వాటిని సంరక్షిస్తుంటారు. అంతేకాదు ఆ పుట్టిన ఆడపిల్ల పుట్టినరోజున..ఇంకా ప్రత్యేక సందర్బాల్లోనూ వారు నాటిని మొక్కల్ని పూజిస్తారు.

మొక్కల సంప్రదానికి నాంది పలికిన గ్రామ పెద్ద..
ఇలా ఆడపిల్ల పుడితే మొక్కలు నాటాలనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది పింప్లాటి గ్రామం మాజీ నేత ‘శ్యామ్ సుందర్ పాలిపాల్’. ఆయన ఆశయం వెనుక ఉన్న కారణమేంటంటే..శ్యామ్ సుందర్ పాలిపాల్ కు ఓ ఆడపిల్ల పుట్టి బాల్యంలోనే చనిపోయింది. దీంతో ఆయన తన కూతురు జ్ఞాపకార్థంగా 111 మొక్కలు నాటారు. ఆ మొక్కల్ని సంరక్షించారు. దీంతో ఆ ప్రాంతంలో చక్కగా పచ్చదనం వెల్లివిరియటంతో ఓ కొత్త ఆలోచన వచ్చిందాయనకు.

దానికి శ్రీకారమే..‘ఆడపిల్ల పుడితే 111 మొక్కలు నాటాలి’ అనే కార్యక్రమానికి నాంది అయ్యింది. ఇప్పుడు ఆయన పదవిలో లేకపోయినా ఆ పచ్చని సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. అలా పింప్లాటి గ్రామం అంతా పచ్చదనం పరుచుకుంది. ఆ గ్రామమే కాకుండా ఆ చుట్టుపక్కల అంతా పచ్చదనం కొలువుదీరింది. అలా ఇప్పటి వరకూ ఆ గ్రామంలో మూడు లక్షలకు పైగా నాటిన మొక్కలు చెట్లుగా మారి పచ్చదనం వెల్లివిరుస్తోంది.