ట్రంప్ వెళ్లిపోతున్నందుకు సంతోషంగా ఉంది : ఇరాన్ అధ్యక్షుడు

ట్రంప్ వెళ్లిపోతున్నందుకు సంతోషంగా ఉంది : ఇరాన్ అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికవడం పట్ట తామేమీ సంబరపడిపోవడం లేదని ఇరాన్ అధ్యక్షుడు హ‌స‌న్ రౌహానీ తెలిపారు. అయితే, మళ్లీ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టేందుకు వీల్లేకుండా ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయినందుకు చాలా చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బుధవారం(డిసెంబర్-16,2020)ఇరాన్ కేబినెట్ మీటింగ్ సందర్భంగా రౌహానీ …ట్రంప్ ని ఒక రోగ్ అని,అమెరికాలోనే ఎక్కువగా చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తిగా అభివర్ణించారు.

ట్రంప్ వైట్ హౌస్ వదిలి వెళ్లిపోతుండ‌టం చాలా ఆనందాన్నిస్తోంద‌ని, ఇవి ట్రంప్ చివ‌రి రోజులు పేర్కొన్న రౌహాని.. ట్రంప్ చాలా వేధింపులకు పాల్పడ్డారన్నారు. పాల‌న తెలియ‌ని, ఎలాంటి క‌ట్టుబాట్లు లేని అధ్య‌క్షుడు, ఓ ఉగ్ర‌వాది, హంత‌కుడు అని ట్రంప్‌ పై తీవ్ర స్థాయిలో రౌహానీ ఫైర్ అయ్యారు. క‌నీసం వ్యాక్సిన్ల‌ను కూడా పొంద‌కుండా ఇరాన్‌ ను ట్రంప్ అడ్డుకున్నార‌ని రౌహానీ ఆరోపించారు. కాగా, క‌రోనా వ‌ల్ల ఇరాన్ తీవ్రంగా న‌ష్ట‌పోయింది. ఏకంగా 52 వేల మంది మరణించగా..11 ల‌క్షల కేసులు న‌మోద‌య్యాయి.

కాగా,తాను అధ్యక్ష పీఠం ఎక్కిన‌ప్ప‌టి నుంచీ ఇరాన్‌కు వ్య‌తిరేకంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్‌. ఆ దేశానికి వ్య‌తిరేకంగా ఇజ్రాయెల్‌, గ‌ల్ఫ్ అర‌బ్ దేశాల‌ను ఏకం చేయ‌గ‌లిగారు. 2018లో ఇరాన్‌తో ఉన్న న్యూక్లియ‌ర్ డీల్‌ను ర‌ద్దు చేసి, ఆ దేశంపై మ‌ళ్లీ ఆర్థిక ఆంక్ష‌లు విధించారు. బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్ ద‌గ్గ‌ర వైమానిక దాడులు జ‌రిపించి ఇరాన్ జ‌న‌ర‌ల్ ఖాసిమ్ సులేమానీని హ‌త్య చేయించారు. ట్రంప్ దిగిపోయి బైడెన్ వ‌స్తుండ‌టంతో అమెరికాతో మ‌రోసారి స‌త్సంబంధాల కోసం సిద్ధంగా ఉన్న‌ట్లు ఇరాన్ సంకేతాలు పంపిస్తోంది.

అయితే,నిబంధనలకు అనుగుణంగా ఇరాన్ వ్యవహరిస్తే డీల్ ని మళ్లీ తిరిగి కొనసాగిస్తామని,ఆంక్షలను ఎత్తివేస్తామని జో బైడెన్ ఇప్పటికే ప్రమాణం చేశారు. కానీ ఇరాన్ యొక్క మిసైల్స్ ప్రోగ్రామ్ మరియు ప్రాంతీయ కార్యకలాపాల విషయాలపై చర్చలు అవసరమని తెలిపారు. అయితే,ఇరాన్ వీటిని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.