ట్రంప్ కు బిగ్ షాక్..అరెస్ట్ వారెంట్ జారీ

ట్రంప్ కు బిగ్ షాక్..అరెస్ట్ వారెంట్ జారీ

arrest warrant against Trump మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పనున్నడొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్‌ తగిలింది. ఇరాన్‌ సైనికాధికారి ఖాసిమ్ సులేమాని హత్య కేసులో ట్రంప్ పై ఇరాక్‌ కోర్టు అరెస్ట్‌ వారెం‍ట్‌ జారీ చేసింది. జనరల్ ఖాసిమ్ సులేమాని మరియు అబూ మహదీ అల్ ముహండిస్‌లను హతమార్చిన అమెరికా డ్రోన్‌ దాడిపై దర్యాప్తు చేయాల్సిందిగా బాగ్దాద్ కోర్టు జడ్జ్‌ గురువారం ఆదేశించారు. అబూమహదీ అల్ ముహండిస్ కుటుంబంనుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తరువాత వారెంట్ జారీ చేసే నిర్ణయం జరిగిందని, హత్యలపై దర్యాప్తు కొనసాగుతోందని సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ వెల్లడించింది.

అల్ ముహండిస్..ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐసిస్) పై పోరాడేందుకు ఏర్పాటుచేయబడ్డ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ కి డిప్యూటీ లీడర్ గా ఉండేవాడు. ఇక, ఖాసిమ్ సులేమాని..ఇరాక్ టాప్ మిలటరీ అధికారిగా ఉండేవారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కి నాయకత్వం వహించేవాడు. అయితే, గత ఏడాది జనవరి 3న బాగ్దాద్ ఎయిర్ పోర్టు దగ్గరలో కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిం సొలేమానీ,అల్ ముహండిస్ పై అమెరికా ద‌ళాలు వైమానిక దాడి జరిపాయి. ఈ దాడిలో సొలేమానీ,అల్ ముహండిస్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

సోలేమానీ అంతిమయాత్రలో లక్షల సంఖ్యలో ప్రజలు, సోలేమానీ అభిమానులు పాల్గొన్న విషయం తెలిసిందే. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ కమాండర్‌ని చంపినందుకు పగ తీర్చుకుంటామని చెప్పిన ఇరాన్.. అందుకు తగ్గట్లే అడుగులు కూడా వేస్తోంది. కాగా ఇప్పటికే ఈ కేసులో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తోపాటు మరో 47 మంది ఇతర అమెరికన్ అధికారులను అదుపులోకి తీసుకునేందుకు సహకరించాలని ఇంటర్‌పోల్‌ను ఇరాన్ కోరింది. ట్రంప్‌ అధ్యక్ష పదవీకాలం ముగిసినా ట్రంప్‌ను వదిలేది లేదని ఇరాన్‌ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది