ప్రపంచంలో ఎవరూ వెల కట్టలేనంత సంపద చందమామపై పోగుపడిందా? దాని కోసమే చైనా మిషన్ మూన్ చేపట్టిందా?

  • Published By: naveen ,Published On : November 26, 2020 / 04:22 PM IST
ప్రపంచంలో ఎవరూ వెల కట్టలేనంత సంపద చందమామపై పోగుపడిందా? దాని కోసమే చైనా మిషన్ మూన్ చేపట్టిందా?

china moon wealth: నిజంగా చందమామపై అన్వేషణను ఖనిజాల కోసమే చైనా ప్రారంభించిందా. ప్రపంచంలో వెల కట్టలేనంత సంపద అక్కడ పోగుపడిందా? అంటే.. ఔననే చెప్పాలి. 1 పక్కన 15 సున్నాలు..(1 000 000 000 000 000…10 కోటి కోట్ల డాలర్లు)… అంతరిక్షంలో సువర్ణ గని… దొరికిందా బంపర్ జాక్‌పాట్… అంతరిక్షంలో సిక్స్ టీన్(16) సైకీ(psyche) అనే ఓ గ్రహ శకలంలోని ఖనిజాల విలువ ఇదీ అంటూ నాసా కొన్నేళ్ల క్రితమే కనుక్కున్నప్పట్నుంచి అంతరిక్షంలో నిధుల వేట ప్రారంభమైంది.

చంద్రశిలల్లో అత్యంత విలువైన ఖనిజాలు, లోహాలు:
సరిగ్గా ఇప్పుడు చైనా కూడా అదే పని చేస్తుందంటున్నారు.. ఎందుకంటే.. చందమామపైన ఉండే శకలాలు కానీ.. శిధిలాల్లో కానీ మన భూమిపై అత్యంత ఖరీదైన లోహాలుగా చలామణీ అయ్యే ఖనిజాలు బోలెడున్నాయ్. అమెరికన్ స్పేస్ సెంటర్ నాసా ఆపరేషన్ 16 సైకీ(psyche) అందుకే చేపట్టిందని చెప్తుండగా.. ఇప్పుడు చైనా చేపట్టిన చాంగ్ ఫైవ్ మిషన్ గుట్టు కూడా అదేనంటున్నారు. సైకీని మించిన ఖనిజాలు.. లోహాలు.. చంద్రశిలల్లో ఉందని చైనా నమ్ముతోంది..

మూన్ పై మైనింగ్ కోసం చైనా ప్రయత్నాలు:
ఇప్పటిదాకా చంద్రుడిపైకి యాత్ర కానీ.. రాకెట్ల ప్రయోగం కానీ.. కేవలం జలం జాడల కోసం.. మనుషులకు నివాసయోగ్యమా కాదా అనే కోణంలో మాత్రమే జరిగాయ్.. అసలు అంతరిక్షంలోకి ప్రయాణమంటేనే ఓ చందమామ కథల్లాంటి అనుభూతి. అయితే.. చందమామ పైకే యాత్ర సాగించడం ఆ అనుభూతిని ఇంకో రేంజ్‌కి తీసుకుపోవడం. ఇప్పుడలాంటి ఆహ్లాదకర అనుభూతి కాస్తా.. పూర్తిగా వాణిజ్యపరంగా మారిపోయింది.

ఓవైపు మనుషులనే టూరిస్టుల్లా రోదసిలోకి పంపుతుంటే.. ఇప్పుడు అక్కడి గ్రహాలపై మైనింగ్‌కి సిద్ధపడుతున్నాడు మానవుడు. భూమ్మీద చైనా విస్తరణవాదం కాస్తా వికటించిన సందర్భాలు గమనిస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో చైనా చాంగ్ ఫైవ్ మిషన్ జాబిలిని జల్లెడ పట్టడానికి తయారు కావడం ఆసక్తి గొలిపిదే కాదు. చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

చందమామపై ఇప్పటిదాకా చేసిన పరిశోధనల్లో నీటి జాడల కోణంలోనే అన్వేషణ సాగింది. ఈ ఏడాది(2019) అక్టోబర్‌లో దానికి సంబంధించిన ఆధారాలు కూడా లభించాయ్. నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో పబ్లిష్ అయిన కథనం ప్రకారం.. చంద్రుడిలోని చీకటి ప్రాంతాల్లో గడ్డకట్టిన రూపంలో ఉన్నట్లు తేలింది..

చంద్రుడి ధృవప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు కొలరాడో యూనివర్సిటీ సైంటిస్టులు చెప్తున్నారు.. ఈ గడ్డకట్టిన నీటి నుంచే అపారమైన సంపద సృష్టించ వచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.. రాకెట్ ఫ్యూయల్‌కి బదులుగా ఇక్కడి జలాన్ని వాడొచ్చని.. అలానే అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన ఇంధనాన్ని కూడా అంతరిక్ష ఖనిజాల నుంచి తయారు చేయొచ్చని నాసా అంచనా వేసింది.. అందుకే వీటి కోసమే అటు నాసా.. ఇటు చైనా రెండూ తమ ప్రయోగాలకు.. పరిశోధనలకు చంద్రుడిని వాడుకుంటున్నారని అంటున్నారు.