Kabul Airport : కాబుల్ ఎయిర్‌పోర్టుకు ఐసిస్ ముప్పు

అఫ్ఘానిస్థాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్టుకు ఉగ్రదాడి పొంచి ఉందన్న హెచ్చరికలతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. కాబూల్‌ ఎయిర్‌పోర్టు దగ్గర దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Kabul Airport : కాబుల్ ఎయిర్‌పోర్టుకు ఐసిస్ ముప్పు

Kabul

Kabul airport ISIS : అఫ్ఘానిస్థాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్టుకు ఉగ్రదాడి పొంచి ఉందన్న హెచ్చరికలతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. యూకే, యూఎస్‌, ఆస్ట్రేలియాలు తమ దేశ పౌరులకు ఎయిర్‌పోర్టు నుంచి తక్షణమే బయటకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశాయి. ఎయిర్‌పోర్టులో ఉండడం ఏ మాత్రం సురక్షితం కాదని వార్నింగ్‌ ఇచ్చాయి. మరోవైపు కాబూల్ నగరాన్ని తాలిబన్‌లు అష్టదిగ్బంధనం చేసినట్లుగా తెలుస్తోంది. ఎయిర్‌పోర్టుకు దారి తీసే రహదారులన్నింటి మూసివేసినట్లుగా సమాచారం. ఎయిర్‌పోర్టు రహదారులపై తాలిబన్‌ల బలగాల పహారా కాస్తున్నాయి.

అటు కాబూల్‌ ఎయిర్‌పోర్టు దగ్గర దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉగ్రదాడి హెచ్చరికలు కూడా పట్టించుకోని అఫ్ఘాన్‌ పౌరులు, విదేశీయులు వేలాదిగా ఎయిర్‌పోర్టుకు పోటెత్తుతున్నారు. ఎయిర్‌పోర్టు బయట డ్రైనేజీల దగ్గర వారు వెయిట్‌ చేస్తున్న దృశ్యాలు అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. మరోవైపు కాబూల్ ఎయిర్‌పోర్టుకు ఎవ్వరూ వెళ్లకుండా రోడ్లన్నింటినీ మూసివేశారు తాలిబన్‌లు. ఎయిర్‌పోర్టుకు వెళుతున్న ఓ ఆస్ట్రేలియా కుటుంబాన్ని అడ్డగించి చితకబాదారు. ఆ కుటుంబంపై ఇష్టానుసారం దాడులు చేశారు. రక్తమోడుతున్న ఆస్ట్రేలియా పౌరులు కాబూల్ రోడ్లపై పరుగులు తీస్తూ కనిపించారు.

ఇటు కాబూల్‌ విమానాశ్రయం చుట్టూ తాలిబన్లు నియంత్రణను పటిష్టం చేయండంతో అమెరికా తమ దేశ పౌరులకు భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఎయిర్‌పోర్టు నుంచి అమెరికన్లతోపాటు అప్ఘాన్లను యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ విమానాల్లో తరలింపు కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ఎయిర్‌పోర్టుపై ఉగ్రవాదుల దాడి హెచ్చరికలతో విమానాశ్రయం గేట్ల వెలుపల ఉన్న అమెరికన్ పౌరులకు ఆ దేశ రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది.

బయట ఉన్న అమెరికన్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని కోరింది. అబ్బే గేట్, ఈస్ట్ గేట్, నార్త్ గేట్ వద్ద ఉన్న అమెరికా పౌరులు వెంటనే అక్కడ నుంచివ వెళ్లిపోవాలని వార్నింగ్‌ ఇచ్చింది. మరో 15 వందల మంది అమెరికన్లు అఫ్ఘానిస్థాన్ నుంచి తరలింపు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. తాలిబన్లు తమ చెక్‌పోస్టుల వద్ద సొంత భద్రతను పెంచుకున్నారని పెంటగాన్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది.

మరోవైపు అఫ్ఘానిస్థాన్‌లో వివిధ సంస్థలకు చెందిన ఉగ్రవాద శక్తులన్నీ ఏకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అఫ్ఘాన్ తాలిబన్ల పట్టు జారిపోకుండా ఇతర ఉగ్రవాద సంస్థలు కూడా దానికి సాయం చేసేందుకు ముందుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంట్.. తాలిబన్లకు మద్దతుగా వారితో చేతులు కలిపే అవకాశం ఉందని సమాచారం. కాబూల్ విమానాశ్రయాన్ని, దాని పరిసర ప్రాంతాలను ఐసిస్ టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇప్పటికే అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది.