యూఏఈ, ఇజ్రాయెల్‌ మధ్య అంతమైన శత్రుత్వం.. అమెరికా చొరవతో కీలక ఒప్పొందం

  • Published By: vamsi ,Published On : August 14, 2020 / 01:51 PM IST
యూఏఈ, ఇజ్రాయెల్‌ మధ్య అంతమైన శత్రుత్వం.. అమెరికా చొరవతో కీలక ఒప్పొందం

దశాబ్దాల శత్రుత్వాన్ని మరచి యూఏఈ మరియు ఇజ్రాయెల్ చేతులు కలిపాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇజ్రాయెల్ మధ్య ఇవాళ చారిత్రక ఒప్పందం కుదిరింది. పాలస్తీనా ఆక్రమణపై ఇరుదేశాల మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైరానికి ఎట్టకేలకు ఫుల్‌స్టాప్ పడింది. ఇరుదేశాలు ఈ శాంతి ఒప్పందంపై సంతకాలు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

దీంతో ఇప్పుడు ఇరు దేశాలలో దౌత్య సంబంధాలు ప్రారంభం అవుతాయి. మధ్యప్రాచ్యంలో శాంతిని, సాధారణ జీవనాన్ని పునరుద్ధరించడంలో ఇది ‘‘భారీ ముందడుగు’ అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘అద్భుత పురోగతి ఇది! మాకు గొప్ప మిత్రులైన ఇజ్రాయెల్, యూఏఈ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది..’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరుదేశాల నాయకత్వాలతో అమెరికా అధ్యక్షుడు జరిపిన చర్చలు కారణంగా ఈ ఒప్పందం సాధ్యమైందని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.

లేటెస్ట్‌గా జరిగిన ఈ ఒప్పొందంతో ఇంధనం, వాణిజ్యం, భద్రత, టెలీ కమ్యునికేషన్, హెల్త్‌కేర్, పర్యావరణం తదితర అంశాల్లో ఉమ్మడి అభివృద్ధి కోసం ఇరు దేశాల ప్రతినిధులు త్వరలో సమావేశమై సంతకాలు చేయనున్నారు. యూఏఈతో భారతదేశ సంబంధాలు ఎప్పుడూ మంచిగా ఉన్నాయి. యూఏఈ క్రౌన్ ప్రిన్స్ మరియు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇద్దరితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంచి వ్యక్తిగత సంబంధం ఉంది. అటువంటి పరిస్థితిలో, ఇది భారతదేశానికి మరియు మధ్యప్రాచ్యానికి చాలా మంచి నిర్ణయంగా అంతర్జాతీయ సమాజం చెబుతుంది.