మిగిలింది నలుగురే: రష్యాలో 11నెలల ట్రైనింగ్

మిగిలింది నలుగురే: రష్యాలో 11నెలల ట్రైనింగ్

స్పేస్‌లోకి పంపేందుకు ఎట్టకేలకు నలుగురు ఆస్ట్రనాట్స్‌ను ఫైనల్ చేసింది భారత్. వీరంతా రష్యాకు వెళ్లి 11నెలల పాటు శిక్షణ తీసుకోనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం వెల్లడించారు. జనవరి మూడో వారం నుంచి రష్యాలో శిక్షణ మొదలవుతుందని తెలిపారు. స్పేస్ లోకి పంపేందుకు 60మందిని ఎంపిక చేసి వారిని షార్ట్ లిస్ట్ చేస్తూ వచ్చిన ఇస్రో చివరికి ఆ అవకాశం నలుగురికి మాత్రమే అప్పగించింది.

‘రష్యాలో 11వారాల ట్రైనింగ్ అనంతరం భారత్ కు వచ్చి మాడ్యుల్స్ పై ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటారు. ఇస్రో తయారుచేసిన డిజైన్ కు అనుగుణంగా ఎలా ఆపరేట్ చేయాలనే దానిపై ట్రైన్ అవుతారు’ అని వెల్లడించారు. 

రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్‌మస్ సబ్సిడెయిరీ గ్లావొకోస్మాస్ ఓ ప్రకటనలో తెలియజేసింది. అంతరిక్షంలో మనుగడకు అవసరమైన ప్రాణాధార వ్యవస్థను వివిధ పరికరాల సాయంతో ఏర్పాటుచేస్తున్నారు. గాలి, నీరు, ఆహారంతో శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచడం, మానవ వ్యర్థాలను తొలగించడం తదితర కార్యకలాపాలలో శిక్షణ ఇస్తున్నారు. 

థర్మల్ కంట్రోల్ సిస్టమ్ మిషన్ అన్ని దశల్లోనూ వ్యోమనౌక వ్యవస్థలను అనుకూలమైన ఉష్ణోగ్రత పరిధిలో ఉంచుతుంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. స్వయంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించనుంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి వారి సురక్షితంగా భూమిపైకి తీసుకురావడం చాలా ముఖ్యం. తొలిసారిగా మానవుని అంతరిక్షంలోకి పంపే ప్రాజెక్ట్ కు రు.10,000 కోట్లను కేంద్రం కేటాయించింది.

ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న కార్యక్రమంలో, మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, వినియోగం, అధునాతన కంప్యూటర్లను తయారీకి దీనిని కేటాయించారు. గగన్‌యాన్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి వెళ్లి కనీసం వారం రోజులపాటు గడపనున్నారు.