శభాష్ జ్యోతి, తండ్రిని ఎక్కించుకుని 1200 కిమీ సైకిల్ తొక్కిన బీహార్ బాలికపై ఇవాంకా ట్రంప్ ప్రశంసల వర్షం

  • Published By: naveen ,Published On : May 23, 2020 / 03:22 AM IST
శభాష్ జ్యోతి, తండ్రిని ఎక్కించుకుని 1200 కిమీ సైకిల్ తొక్కిన బీహార్ బాలికపై ఇవాంకా ట్రంప్ ప్రశంసల వర్షం

అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కిన 15 సంవత్సరాల బీహార్ బాలిక జ్యోతి కుమారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశవ్యాప్తంగా జ్యోతి పేరు మార్మోగింది. శభాష్ అని అంతా ప్రశంసించారు. కంటే కూతురినే కనాలి అంటూ కితాబిస్తున్నారు. తాజాగా జ్యోతి పేరు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఏకంగా అగ్రరాజ్యం అమెరికా నుంచి కితాబు వచ్చింది.

శభాష్ జ్యోతి:
జ్యోతి గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కు తెలిసింది. జ్యోతిని ఇవాంకా ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తింది. జ్యోతి కుమారి ప్రతిభను మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది. ‘గాయంతో ఉన్న తండ్రిని 15ఏళ్ల జ్యోతి సైకిల్ మీద ఎక్కించుకుని ఏడు రోజుల పాటు తొక్కుతూ 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సొంత గ్రామానికి చేరుకుంది. ఆ అందమైన ఓర్పు, ప్రేమ భారతీయ సమాజాన్నే కాకుండా సైక్లింగ్ ఫెడరేషన్‌ను కూడా ఆకట్టుకుంది’ అంటూ ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేసింది. దీంతో జ్యోతి కుమారి పేరు ఒక్కసారిగా వరల్డ్ వైడ్ డా పాపులర్ అయ్యింది.

లాక్ డౌన్ దెబ్బతో కుదేలు:
బీహార్‌లోని దర్భాంగకు చెందిన మోహన్ పాశ్వాన్ అనే వ్యక్తి తన 15 ఏళ్ల కూతురు జ్యోతి కుమారితో కలిసి కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి వలస వెళ్లాడు. అక్కడ రిక్షా తొక్కుతూ దాంతో వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్న అతనికి కరోనా దెబ్బ కొట్టింది. లాక్‌డౌన్‌ కారణంగా కిరాయికి తీసుకొచ్చిన రిక్షాను యజమాని వెనక్కి తీసుకున్నాడు. ఇక ఉపాధి లేక చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితిలో వీరు ఉంటున్న గది అద్దెను చెల్లించాలని యజమాని డిమాండ్‌ చేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో వారు సొంతూరికి పయనమయ్యారు. తమను గమ్యస్థానానికి చేర్చాలని ఓ ట్రక్కు డ్రైవర్ ని వారు కోరారు. అందుకు అతను రూ. 6 వేలు డిమాండ్‌ చేశాడు. 

7 రోజులు, 1200కిమీ, సైకిల్ పై ప్రయాణం:
అంత డబ్బు లేక ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో రూ. 500లకు ఓ సైకిల్‌ను కొన్నారు. మే 10వ తేదీన ఢిల్లీ నుంచి దర్భాంగకు తండ్రి, కూతురు సైకిల్‌పై బయల్దేరారు. సైకిల్ ప్రయాణం ఓ పది కిలోమీటర్ల వరకు బాగానే సాగింది. కానీ మోహన్ అనారోగ్య సమస్య వల్ల సైకిల్ తొక్కలేకపోయాడు. దీంతో కూతురు జ్యోతి తన తండ్రిని సైకిల్ పై కూర్చొబెట్టుకొని సైకిల్ తొక్కడం ప్రారంభించింది. అలా సుమారు వారం రోజుల పాటు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కింది. చివరికి సొంతూరికి చేరుకుంది. ఓ కూతురు తండ్రిని కూర్చోపెట్టుకుని గురుగ్రామ్ నుంచి బీహార్‌కు ఏడు రోజుల్లో 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన విషయాన్ని మీడియా వెలుగులోకి తేవడంతో ఆ బాలిక సాహసం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశవ్యాప్తంగా జ్యోతిపై ప్రశంసల వర్షం కురిసింది.

3 గంటలు మాత్రమే నిద్ర:
వారం రోజులపాటు అలుపెరగకుండా సాగించిన ప్రయాణంతో చివరికి ఇద్దరూ సొంతూరికి చేరుకున్నారు. అయితే మార్గంమధ్యలో కేవలం రాత్రి సమయాల్లో 2 నుంచి 3 గంటలు మాత్రమే పెట్రోల్‌ బంకుల్లో విశ్రాంతి తీసుకునే వారు. మళ్ళీ ఇల్లు చేరాలనే సంకల్పం ఆమెను సైకిల్ తొక్కించింది. మే 16న సొంతూరికి రాగానే తండ్రీ కూతుళ్లను క్వారంటైన్‌కు తరలించారు అధికారులు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. డబ్బు లేక సైకిల్ పై 1200 కిలోమీటర్లు ప్రయాణించినట్లు, తన తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో తానే సైకిల్ తొక్కినట్లు జ్యోతి చెప్పింది. ప్రయాణంలో రాత్రి వేళల్లో పెట్రోల్ బంకుల్లో నిద్రించామని, సహాయ శిబిరాల్లో భోజనం చేశామని తెలిపింది. 

సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి పిలుపు:
1200 కిలోమీటర్ల దూరాన్ని ఏడు రోజుల్లో చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. అసలు అంత దూరం సైకిల్ తొక్కడం సామాన్యమైన విషయం కాదు. దీన్ని గ్రహించిన సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యోతి ప్రతిభను మెచ్చుకుంది. జ్యోతి కుమారిని సైక్లింగ్ ట్రయల్స్‌కు రావాల్సిందిగా ఆహ్వానించింది. ఆమె ట్రయల్స్‌లో సెలక్ట్ అయితే, ట్రైనీగా అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఆమెకు పూర్తిస్థాయిలో ట్రైనింగ్ ఇస్తారు. ఇక జ్యోతి కుమారి ప్రతిభను గుర్తించిన ఐసీఎఫ్ అధికారులు జ్యోతికి స్వయంగా ఫోన్‌ చేసి ట్రయల్స్ కోసం ఢిల్లీకి రమ్మని పిలిచారు. ట్రైనింగ్ అందిస్తామని, ఇందుకు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని చెప్పారు. ‘‘1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమెలో అసాధారణ ప్రతిభ ఉంది. ఏడు లేదా ఎనిమిది ప్రమాణాలను తాను దాటితే.. తను జాతీయ జట్టులోకి ఎంపిక అవుతుంది. అంతేకాక.. ట్రైనింగ్ సమయంలో తను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు” అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

Read: తండ్రిని కూర్చొబెట్టుకుని 1200కి.మీ సైకిల్ తొక్కిన జ్యోతికి CFI బంపరాఫర్