అమెరికా ఎన్నికల్లో మళ్లీ ట్రంప్ గెలిస్తే వైట్ హౌస్ వదిలేస్తానేమో: ఇవాంకా ట్రంప్

  • Published By: vamsi ,Published On : December 30, 2019 / 04:14 AM IST
అమెరికా ఎన్నికల్లో మళ్లీ ట్రంప్ గెలిస్తే వైట్ హౌస్ వదిలేస్తానేమో: ఇవాంకా ట్రంప్

అమెరికాలో మళ్లీ ఎన్నికలు హడావుడి కనిపిస్తుంది. డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. వచ్చే ఏడాది అంటే 2020లో అమెరికాకు ఎన్నికలు జరగబోతున్నాయి. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధ్యక్షునిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో నిలబడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి తన తండ్రి ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారనే ప్రశ్నకు సమాధానంగా.. ‘వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మా నాన్న డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ గెలిస్తే, వైట్‌హౌస్‌ను నేను వదిలివెళ్తానేమో. నాకు నా పిల్లలు, వాళ్ల సంతోషమే ముఖ్యం. అదే నన్ను నడిపిస్తుంది. మొదట నా పిల్లల అవసరాలు తీర్చడమే నాకు ప్రధానం…’ అని అన్నారు. ఇవాంక ట్రంప్.. ప్రస్తుతం ట్రంప్‌ సలహాదారుగా ఉన్నారు.

గత ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించడంలో ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ కీలక పాత్ర పోషించారు. అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత నుంచి పాలన, తదితర విషయాల్లోనూ ఇవాంకా ట్రంప్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. మరోసారి ట్రంప్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతుండగా.. ఇటువంటి తరుణంలో ఇవాంకా వ్యాఖ్యలు అమెరికాలో, రిపబ్లికన్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.