అఫ్గానిస్థాన్​-తాలిబన్ల మధ్య శాంతి చర్చలు…భారత్​ జోలికి రాకూడదన్న జైశంకర్

  • Published By: venkaiahnaidu ,Published On : September 12, 2020 / 07:29 PM IST
అఫ్గానిస్థాన్​-తాలిబన్ల మధ్య శాంతి చర్చలు…భారత్​ జోలికి రాకూడదన్న జైశంకర్

అఫ్గానిస్థాన్​ లో శాంతిస్థాపన దిశగా శనివారం ఖతార్ వేదికగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమక్షంలో అఫ్గానిస్థాన్ ప్రభుత్వం- తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. రాజ్యాంగం మార్పులు, అధికార విభజణపై ఇరుపక్షాలు చర్చించాయి. దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన యుద్ధంలో పదివేల మందిని చంపిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం- తాలిబాన్ల మధ్య శాంతి చర్చలు ప్రారంభమవడం విశేషం.

అఫ్గానిస్థాన్​-తాలిబన్ల మధ్య జరిగిన చర్చల్లో భారత విదేశాంగ మంత్ర జైశంకర్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, మైనార్టీలు, మహిళలు, అణగారిన వర్గాల హక్కులను కాపాడేలా.. హింసకు తావులేకుండా శాంతి ప్రక్రియ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఆఫ్గాన్‌ భూభాగం నుంచి భారత్​కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు జరగకూడదని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.


అంతర్గత యుద్ధంతో దెబ్బతిన్న ఆఫ్గన్‌లో శాంతి, సుస్థిరత నెలకొనాలని ఆకాంక్షిస్తున్న భారత్‌… ఆ దేశ పునర్నిర్మాణానికి 2బిలియన్‌ డాలర్ల సాయం అందించింది.

5 వేల మంది తాలిబాన్ ఉగ్రవాదుల విడుదల

శాంతి చర్చలు ప్రారంభించడానికి ఆఫ్ఘన్ ప్రభుత్వం ఈ ఏడాది 5 వేల మంది తాలిబాన్ ఉగ్రవాదులను విడుదల చేసింది. ఇందులో చాలా మంది సైనికులు, పౌరులను చంపిన 400 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. అష్రఫ్ ఘని ప్రభుత్వం గత వారం 3,200 సంఘ నాయకులు, రాజకీయ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు ఖైదీలను విడుదల చేయడంపై నిర్ణయం తీసుకున్నారు. చర్చలు విజయవంతమైతే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం మేరకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు తిరిగి రావడం ద్వారా ట్రంప్ ప్రయోజనం పొందుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.


కాగా, ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి కోసం అమెరికా, తాలిబాన్ల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 29 న కుదిరిన ఒప్పందంపై తాలిబాన్ సంతకం చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం తాలిబాన్ హింసను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పలు దశల్లో సైనికులను అమెరికా ఉపసంహరించుకోవలసి వుంటుంది. ఒప్పందం ప్రకారం.. తాలిబాన్లు అల్-ఖైదా, ఇతర ఉగ్రవాద గ్రూపులను విడిచిపెట్టవలసి ఉంటుంది. అదే సమయంలో ఆఫ్ఘన్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులపై ఉగ్రవాద దాడులను కూడా నిలుపవలసి ఉంటుంది.