మావాళ్లకు కోవిడ్-19 మలద్వారం టెస్టులు చేయొద్దు.. వెంటనే ఆపేయండి.. చైనాకు జపాన్ వార్నింగ్!

మావాళ్లకు కోవిడ్-19 మలద్వారం టెస్టులు చేయొద్దు.. వెంటనే ఆపేయండి.. చైనాకు జపాన్ వార్నింగ్!

China to stop anal COVID-19 tests : చైనాకు వచ్చే జపానీయులకు డ్రాగన్ దేశం కోవిడ్-19 టెస్టులు చేస్తోంది. మలద్వారం (ఆనల్) టెస్టులను చేయడంపై జపాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చైనాలో అడుగుపెట్టే తమ దేశ పౌరులకు కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష కోసం మలద్వారం శాంపిల్స్ తీసుకోవడం వెంటనే ఆపేయాలని జపాన్ సూచించింది. ఈ తరహా విధానం తమ పౌరుల్లో మానసిక క్షోభకు గురిచేస్తోందని, జపాన్ అధికారులు పేర్కొన్నారు. చైనా చర్యపై ఇప్పటికే చాలామంది జపానీయులు తమ దేశీయ అధికారులకు ఫిర్యాదు చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసినా డ్రాగన్ చైనా జనవరిలో మలద్వారం స్వాబ్ టెస్టులు చేయడం మొదలుపెట్టింది. ఆనల్ స్వాబ్ టెస్టుల్లో 3-5 సెంటీమీటర్లు వరకు కాటన్ స్వాబ్‌ను మలద్వారంలోకి దూర్చి మెల్లిగా తిప్పుతూ శాంపిల్స్ సేకరిస్తారు. అమెరికా దౌత్యవేత్తలకు సైతం మలపరీక్షలను పరీక్షలు చేసినట్టు కథనాలు వచ్చాయి. దీనిపై చైనా తీవ్రంగా ఖండించింది. మలద్వారం స్వాబ్ టెస్టులతో మానసిక వేదన అనుభవించామని జపనీయులు చైనాలోని రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.

చైనాలో అడుగు పెట్టిన జపనీయులు, అలాగే క్వారంటీన్‌లో ఉన్న కొందరు జపనీయులకు ఈ ఆనల్ స్వాబ్ టెస్టులు నిర్వహించారు. మలద్వారం టెస్టులు నిర్వహించొద్దంటూ బీజింగ్‌లోని జపాన్ రాయబార కార్యాలయం చేసిన అభ్యర్థనపై చైనా నుంచి ఎలాంటి స్పందనలేదు. మరోవైపు మలద్వారం టెస్టుల ద్వారా కరోనా వైరస్ సోకినవారిని తొందరగా గుర్తించవచ్చునని చైనా నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, కరోనా వైరస్ నోటి ద్వారా లేదా ముక్కు ద్వారానే వ్యాపిస్తుందని, ప్రస్తుత కోవిడ్ టెస్టులే ఎంతో సమర్థవంతమైనవని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.