కరోనా భయం: మాస్క్ లేకుండా దగ్గారని రైలునే ఆపేశాడు!

  • Published By: sreehari ,Published On : February 22, 2020 / 11:42 PM IST
కరోనా భయం: మాస్క్ లేకుండా దగ్గారని రైలునే ఆపేశాడు!

కరోనా వైరస్ (COVID-19) వ్యాప్తి మొదలైనప్పటినుంచి గత కొన్నినెలలుగా ప్రపంచ వ్యాప్తంగా చాలామందిలో కరోనా భయం ఆవహించింది. రోడ్లుపై వెళ్లేటప్పుడు లేదా బస్సులు, రైళ్లలో ఎవరైనా తుమ్మినా దగ్గినా వారికి కరోనా వైరస్ సోకుతుందనే భయాందళన నెలకొంది. వెంటనే అక్కడి నుంచి పారిపోవడం లేదా తీవ్ర మానసిక భ్రాంతికి లోనవుతున్నారు. వాస్తవానికి దగ్గినవారిలో కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా సరే.. ముందు జాగ్రత్త చర్యగా జపనీస్ వాసులు మాస్క్‌లు ధరించి రోడ్లపైకి వస్తున్నారు.

ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకి 76,723 కేసులు నమోదు కాగా, మొత్తంగా 2,247 మంది మృతిచెందారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడంతో ప్రపంచ దేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. కరోనా వైరస్ ప్రబలకుండా కంట్రోల్ చేసేందుకు నివారణ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా వైద్య సదుపాయాలు, ఫేస్ మాస్క్ లు, టాయిలెట్ పేపర్లు, ఆల్కాహాల్ సహా నిత్యావసర వస్తువులను ఆసియాలోని సూపర్ మార్కెట్లలో, డ్రగ్ స్టోర్లలో సరఫరా చేస్తోంది. 

కొన్నిరోజులుగా ఆన్ లైన్ లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని రుమార్లు వస్తున్నాయి. దాంతో అక్కడివారంతా మానసిక భ్రాంతితో ఆన్ లైన్లో అవసరమైన వస్తువులను కూడా కొనుగోలు చేయడంలేదు. జపాన్‌లో ప్రతిరోజు రైళ్లు మిలియన్ల మంది నివాసితులను తమ గమ్యాలకు చేరవేస్తున్నాయి. కరోనా భయంతో ఎక్కడ వైరస్ సోకుతుందనే భయంతో రైళ్లలోనే ప్రయాణిస్తున్నారు.

ఫిబ్రవరి 18న సుమారుగా రాత్రి 8 గంటలు అవుతుంది. ఫుకుయోకా నగరంలోని నానాకుమా లైన్‌లోని టెంజిన్ మినామి నుండి హషిమోటోకు వెళ్లే రైలు కార్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. రైల్లో ప్రయాణిస్తున్న ఫేస్ మాస్క్ లేని వ్యక్తి పక్కనే ఉన్న వ్యక్తిపై ఒక్కసారిగగా దగ్గాడు. అంతే పక్కన వ్యక్తి భయంతో ఎమర్జెన్సీ స్టాప్ బటన్ నొక్కేశాడు. అంతేకాదు.. ఇంటర్ కామ్‌లో తన పక్కనే ఉన్న వ్యక్తి దగ్గాడంటూ రిపోర్టు చేశాడు. దగ్గిన వ్యక్తితో వాదనకు దిగాడు. మాస్క్ ఎందుకు ధరించలేదని గొడవపడ్డాడు. దాంతో రైల్లోని ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. 

ఎమెర్జెన్సీ స్టాప్ బటన్ నొక్కడంతో సమీపంలోని స్టేషన్ లో రైలు ఆగిపోయింది. వెంటనే రైల్వే సిబ్బంది రైల్లోకి ప్రవేశించి దగ్గిన వ్యక్తి, అత్యవసర బటన్ నొక్కిన వ్యక్తిని కిందికి దింపేశారు. ముఖానికి మాస్క్ ధరించని వ్యక్తి మాట్లాడుతూ.. దుకాణాలలో ఫేస్ మాస్క్ లు అందుబాటులో లేకపోవడంతో ముసుగు ధరించలేదని వివరించాడు. చివరికి ఇద్దరూ రాజీపడి తదుపరి రైలు వచ్చేవరకు స్టేషన్లో వేచి ఉన్నారు. ఈ ఘటనతో జపాన్ ఆన్ టైమ్ రైల్వే సిస్టమ్ పై ప్రభావం పడింది. రైలు మూడు నిమిషాలు ఆలస్యం అయింది. తోటి ప్రయాణికుడు ముసుగు ధరించలేదనే కారణంతో ఎవరైనా రైలును ఆపుతారా? అని పుకుయోకా సిటీ సబ్వే ప్రతినిధి ఒకరు అన్నారు. ఈ ఘటనపై స్పందించిన జపాన్ నివాసితులు.. అవతలి వ్యక్తి నిజంగా రుమాలు లేదా టవల్ ఉపయోగించాలని తమకు తోచిన సూచనలు చేశారు. 

మరొకరు అయితే రైల్ కోచ్‌లలో ముసుగు మాత్రమే ఉండాలని డిమాండ్ చేశారు. ముసుగు లేదని ఎవరూ కూడా రైల్వే అత్యవసర బటన్ నొక్కడం మానుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులను హెచ్చరించారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. జపాన్ దేశంలో ఇప్పటివరకూ 3 కరోనా సోకి మృతిచెందగా, ఇప్పటివరకూ 725 కేసులు నమోదయ్యాయి. ఇందులో యోకోహామాలో క్రూయిజ్ షిప్ నుంచి 634 కేసులు ఉన్నాయి.