జ‌పాన్ ప్రధాని రాజీనామా

  • Published By: venkaiahnaidu ,Published On : August 28, 2020 / 03:04 PM IST
జ‌పాన్ ప్రధాని రాజీనామా

జ‌పాన్ ప్రధాని షింజో అబే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం(ఆగస్టు-28,2020)ఆయన ప్రకటించారు. రోజురోజుకూ క్షీణిస్తున్న తన ఆరోగ్య పరిస్థితి పరిపాలనకు సమస్యగా మారకూడదని నిర్ణయించుకున్న షింజో అబే రాజీనామా చేశారు. గత కొన్నేళ్లుగా అల్సరేటివ్ కొలిటిస్​ అనే వ్యాధితో బాధపడుతున్న అబే… ఇటీవల వారం వ్యవధిలోనే రెండు సార్లు ఆస్పత్రికి వెళ్లిన విషయం తెలిసిందే.



శుక్రవారం షింజో అబే విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… ప్రజల కోసం నేను ఉత్తమ నిర్ణయాలు తీసుకోలేకపోతే నేను ప్రధానిని కాను. నేను నా పదవి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను అని ఆయన అన్నారు. పెద్ద ప్రేగులో కణితి ఏర్పడటంతో ఈ మధ్య ఆరోగ్యం మరింత క్షీణించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత నెల రోజులుగా తన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మారిందని, శారీరకంగా బాగా అలసిపోతున్నానని, వైద్యులను సంప్రదిస్తే వ్యాధి తిరగబడిందని చెప్పారన్నారు. ప్రజలు తనపై పెట్టిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించలేక పోతున్నందున పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రాజకీయాల్లో ఫలితాలను సాధించడం చాలా ముఖ్యమని, అనారోగ్యం కారణంగా రాజకీయ నిర్ణయాల్లో తాను విఫలమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తన పదవీ కాలం పూర్తి చేయలేకపోయినందున ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

తన స్థానంలో ఎవరు ప్రధాని బాధ్యతలు చేపడతారు అన్న విషయాన్నీ అబే వెల్లడించలేదు. కానీ కొత్త ప్రధాని కరోనావైరస్ తో పోరాడటం కొనసాగించాలని అబే అన్నారు. కాగా ప్ర‌స్తుత‌ం ఉప ప్రధానిగా ఉన్న తారో అసో తాత్కాలిక ప్రధానిగా బాద్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

రాజకీయ సంక్షోభంలో జపాన్‌ కొట్టుమిట్టాడుతున్న సమయంలో సుస్థిరత తెచ్చిన నేతగా అబేకు గుర్తింపు ఉంది. షింజో అబే వయసు ప్రస్తుతం 65 సంవత్సరాలు. 2021 సెప్టెంబ‌రు వ‌ర‌కు ప్ర‌ధానిగా ఆయన ప‌ద‌వీకాలం ఉంది. జపాన్ లో ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా అబే రికార్డు సృష్టించారు. ఎక్కువ కాలం1964 నుంచి 1972 వరకు 2,798 రోజులు ప్రధానిగా సేవలందించిన తన ముత్తాత ఐసాకు సాటో రికార్డును సోమవారంతో అధిగమించారు షింజో. దీంతో జపాన్​ ప్రధానిగా ఎక్కువ కాలం పని చేసిన వ్యక్తిగా రికార్డుకెక్కారు.
https://10tv.in/german-man-cuts-his-ears/
తొలుత 2006లో సంకీర్ణ ప్రభుత్వం తరఫున ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అబే.. కూటమిలో విభేదాలతో 2007లో రాజీనామా చేశారు. తిరిగి 2012లో రెండోసారి ప్రధానిగా ఎన్నికై అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే క‌రోనా మ‌హమ్మారిపై నియంత్ర‌ణ‌, అధికార పార్టీ నేత‌ల అవినీతి కుంభ‌కోణం లాంటివి షింజో అబేను ఇరుకున పెట్టాయి. దీంతో బ‌హిరంగంగానే ప్ర‌ధానిని కుర్చీలోంచి దిగిపోవాలంటూ ప‌లువురు నిర‌స‌న తెలిపారు. అయితే ద్ర‌వ్య స‌డ‌లింపు విధానంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రిస్తానంటూ షింజో ఓ స‌మావేశంలో పేర్కొన్నాడు. కానీ గ‌త కొంత కాలంగా వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో అబే ఇప్పుడు తన పదవికి రాజేన చేశారు.