Poland : చిన్నారి వైద్యం కోసం ఒలింపిక్స్ మెడల్ వేలం
పోలాండ్‌కు చెందిన జావెలిన్ త్రోయర్ మారియా ఆండ్రెజిక్ మానవత్వం చాటుకుంది. చిన్నారి వైద్యం కోసం తాను గెలిచిన సిల్వర్ మెడల్ ను వేలం వేసింది.

Maria Andrejczyk : పోలాండ్‌కు చెందిన జావెలిన్ త్రోయర్ మారియా ఆండ్రెజిక్ మానవత్వం చాటుకుంది. ఓ చిన్నారికి వైద్య చేయించేందుకు టోక్యో ఒలింపిక్స్‌లో తాను గెలిచిన సిల్వర్ మెడల్‌ను వేలానికి పెట్టింది. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో మారియా ఆండ్రెజిక్ జావెలిన్‌ను 64.61 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్ దక్కించుకుంది. అయితే అది గెలిచిన వారంలోపే తన దేశానికి చెందిన 8 నెలల చిన్నారి గుండె సర్జరీ కోసం వేలం వేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని ఆమె తన ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించింది. మలీసా అనే 8 నెలల చిన్నారి తన సర్జరీ కోసం పోలాండ్ నుంచి కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లాడు. ఆమె ఈ వేలం పోస్ట్ చేసిన వారం రోజుల తర్వాత గరిష్ఠంగా మెడల్‌కు 1.25 లక్షల డాలర్ల బిడ్ దాఖలైంది. ఈ బిడ్‌ను పోలాండ్‌కు చెందిన సూపర్ మార్కెట్ చెయిన్ జాబ్కా దాఖలు చేసింది.
అయితే వేలంలో సిల్వర్ మెడల్ గెలుచుకున్నా.. దానిని తీసుకోవడానికి ఆ సంస్థ నిరాకరించింది. డబ్బుతో పాటు సిల్వర్ మెడల్‌ను కూడా మారియాకే తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించినట్లు జాబ్కా తెలిపింది. నిజానికి మారియా కూడా క్యాన్సర్‌ను జయించింది.
2018లో ఆమెకు బోన్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అయితే ఆ మహమ్మారిని జయించిన ఆమె.. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. రియో ఒలింపిక్స్‌లో 2 సెంటీమీటర్ల దూరంలో మెడల్ మిస్సైన ఆమె.. ఇప్పుడు తన కలను సాకారం చేసుకుంది.