అమెజాన్ సీఈవో ఫోన్ హ్యాక్ చేసిన సౌదీ యువరాజు!

  • Published By: venkaiahnaidu ,Published On : January 22, 2020 / 11:17 AM IST
అమెజాన్ సీఈవో ఫోన్ హ్యాక్ చేసిన సౌదీ యువరాజు!

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫౌండర్,సీఈవో జెఫ్ బెజోస్ మొబైల్ ఫోన్ హ్యాంకింగ్ కు గురైంది. జెఫ్ బెజోస్ మొబైల్ డేటాను సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హ్యాక్ చేసినట్లు సమాచారం. 2018 మే 1న బెజోస్‌కు సౌదీ యువరాజు వాట్సాప్ సందేశం పంపారు. సౌదీ యువరాజు పంపిన ఎన్‌క్రిప్టెడ్ వాట్సాప్ వీడియో ద్వారా బెజోస్ మొబైల్ హ్యాకింగ్‌కు గురైనట్టు తెలుస్తోంది. ఈ హ్యాకింగ్ తర్వాతే.. గతంలో టీవీ యాంకర్‌గా పని చేసిన లారెన్ సంచెజ్‌తో బెజోస్‌కు వివాహేతర సంబంధం ఉన్న విషయ వెలుగు చూసింది. దీంతో బెజోస్‌కు అతడి భార్య విడాకులు ఇచ్చి భారీ మొత్తంలో భరణం పొందారు.

ఈ వివరాలను ఐక్యరాజ్యసమితికి చెందిన ఇద్దరు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. బెజోస్‌కు సౌదీ యువరాజు నుంచి ఓ మెసేజ్ వచ్చిందని, ఆ మెసేజ్ ద్వారానే ఆయన ఫోన్ హ్యాక్ అయినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని సదరు అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని వారు చెప్పారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైన నిందలని అమెరికాలోని సౌదీ ఎంబసీ తెలిపింది. ఈ విషయంలో కావాలంటే సౌదీతోపాటు అమెరికా కూడా దర్యాప్తు చేయాలని ఎంబసీకి చెందిన ఓ అధికారి సూచించారు.

బెజోస్‌ ఫోన్ హ్యాకింగ్‌కు గురైన ఐదు నెలల తర్వాత.. ఆయనకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో కాలమిస్ట్‌గా పని చేసే జమాల్ ఖషోగ్గి హత్యకు గురయ్యారు. టర్కీలోని సౌదీ కాన్సులేట్‌లో జమాల్‌ను కొందరు హత్య చేశారు. ఈ మర్డర్ చేసిన వారికి సల్మాన్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలున్నాయి.