బైడెన్ రాకకు వేళాయే : స్టార్ల ప్రదర్శనలు, వర్చువల్ కవాతు

బైడెన్ రాకకు వేళాయే : స్టార్ల ప్రదర్శనలు, వర్చువల్ కవాతు

Joe Biden : అమెరికా చరిత్రలో మరో కీలక ఘట్టానికి కౌంట్‌ డౌన్ స్టార్ట్ అయింది. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇనాగురేషన్ పేరుతో అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వాషింగ్టన్ డీసీలో ఇది జరుగుతుంది. ప్రమాణ స్వీకారం పూర్తవ్వగానే బైడెన్ అధికారికంగా అమెరికాకు 46వ అధ్యక్షుడు అవుతారు. సాధారణంగా అధ్యక్ష పదవి కన్నా ముందే ఉపాధ్యక్ష పదవికి ప్రమాణస్వీకారం జరుగుతుంది.

గాయనీ, గాయకుల ప్రదర్శనలు : –
అమెరికా కాలమానం ప్రకారం ఉదయం పది గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలవుతుంది. అంటే ఇండియన్‌ టైమింగ్స్‌లో 2021, జనవరి 20వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది.
గత కొన్నేళ్లుగా ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో అమెరికాలోని ప్రముఖ గాయనీ గాయకుల ప్రదర్శనలు ఇవ్వడం పెరిగింది. ఈసారి కూడా అలాగే జరగనుంది. ప్రముఖ పాప్ స్టార్ లేడీ గాగా బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా అమెరికా జాతీయ గీతం పాడనున్నారు. ఆ తర్వాత సంగీత ప్రదర్శనలో మరో పాప్ స్టార్ జెన్నీఫర్ లోపెజ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్శణగా నిలువనున్నది. బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సాయంత్రం గంటన్నర పాటు ప్రత్యేక టీవీ కార్యక్రమం జరగనుంది. జాన్ బోన్ జోవి, డెమీ లొవాటో, జస్టిన్ టింబర్లేక్ లాంటి స్టార్లు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రముఖ నటుడు టామ్ హాంక్స్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

పరిమిత సంఖ్యలో జనాలకు అనుమతి : –
సాధారణంగా అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు హాజరయ్యేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో జనం వస్తుంటారు. 2009లో ఒబామా మొదటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు 20 లక్షల మంది హాజరయ్యారు. కానీ.. ఈ సారి కరోనా దృష్ట్యా చాలా పరిమిత సంఖ్యలోనే జనాన్ని అనుమతించనున్నట్లు బైడెన్ బృందం తెలిపింది. ఇతర ప్రాంతాల నుంచి జనం ఇక్కడకు రావొద్దని విజ్ఞప్తి చేసింది.

క్యాపిటల్ భవనం ఎదుట ప్రమాణం : –
క్యాపిటల్ భవనం ముందు ఏర్పాటు చేసిన వేదికపై బైడెన్, హారిస్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. 1981లో రోనల్డ్ రీగన్‌తో మొదలు.. అందరు అధ్యక్షులూ ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక క్యాపిటల్ భవనం ముందున్న నేషనల్ మాల్ పార్క్‌లో వీక్షకుల కోసం ఉన్న స్టాండ్లను అధికారులు తొలగించారు. ఇదివరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రెండు లక్షల టికెట్లు అందుబాటులో ఉంచేవారు. అయితే కోవిడ్ వ్యాప్తి కారణంగా ఈసారి వెయ్యి టికెట్లు మాత్రమే పెట్టారు. అధికార బదిలీ సంప్రదాయంలో భాగంగా పాస్ ఇన్ రివ్యూ కార్యక్రమం కూడా ఈసారి జరగనుంది. ఈ కార్యక్రమంలో కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో కొత్త అధ్యక్షుడు సైన్యాన్ని పరిశీలిస్తారు. సాధారణంగా పెన్సిల్వేనియా అవెన్యూ నుంచి వైట్ హౌజ్ వరకూ ఈ కవాతు జరుగుతుంది. అయితే.. ఈసారి అమెరికా వ్యాప్తంగా వర్చువల్ కవాతు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.