‘నాకు ఓటేసినా లేకపోయినా అమెరికా ప్రజలందరికీ అధ్యక్షుడిగా ఉంటా’ : జో బైడెన్

  • Published By: bheemraj ,Published On : November 8, 2020 / 12:33 AM IST
‘నాకు ఓటేసినా లేకపోయినా అమెరికా ప్రజలందరికీ అధ్యక్షుడిగా ఉంటా’ : జో బైడెన్

US president Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ తొలి ట్విట్ చేశారు. అమెరికా వంటి గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి తనను ఎన్నుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తనను ఓటేసినా లేకపోయినా అమెరికా ప్రజలందరికీ అధ్యక్షుడిగా ఉంటానన్నారు.



తనపై అమెరికా ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. అమెరికా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కాసేపటికే బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా, కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు వారి ట్విటర్ ప్రొఫైల్ మారడం గమనార్హం.



అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ సంచలనం విజయం సాధించాడు. 284 సీట్లలో బైడెన్ గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 270 దాటేశారు. డొనాల్డ్ ట్రంప్ 214 సీట్లకే పరిమితమయ్యారు. 46 వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలుపొందారు. దక్షిణాసియా నుంచి అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ రికార్డు సాధించారు.



జోబైడెన్ మొట్టమొదటి సారి డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 2009 నుంచి 2017వరకు బరాక్ ఒబామా పాలనలో 47 వ వైస్ ప్రెసిడెంట్ గా బైడెన్ సేవలు అందించారు. అంతేకాకుండా 1973 నుంచి 2009 వరకు డెలావార్ సెనెటర్ గా ఆయన సుదీర్ఘ కాలం కొనసాగారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.