కరోనా కట్టడిపై బైడెన్‌ ప్రణాళిక ఇదేనా?

  • Published By: sreehari ,Published On : November 8, 2020 / 05:00 PM IST
కరోనా కట్టడిపై బైడెన్‌ ప్రణాళిక ఇదేనా?

Joe Biden’s Plan : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్‌ పైనే అందరి దృష్టి పడింది. కరోనావైరస్‌ కట్టడిలో ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ బైడెన్ ఇదే విషయంలో ఆరోపించారు కూడా.

గ్రేట్‌ డిప్రెషన్‌ తర్వాత తలెత్తిన మహా విపత్తుగా బైడెన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు బైడెన్ ఎన్నికల్లో విజయం సాధించారు. కరోనాతో అస్తవ్యస్తమైన అగ్రరాజ్యాన్ని ఎలా సాధారణ స్థితికి తీసుకొస్తారు? దేశంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు రచిస్తారనే ఆసక్తి నెలకొంది.



అమెరికాలో కీలక నిర్ణయాల అమలుకు సెనెట్‌ ఆమోదం తప్పని సరిగా ఉండాలి. ఇప్పుడు సెనెట్‌లో రిపబ్లికన్ల ఆధిపత్యం కొనసాగుతోంది. ట్రంప్‌ కంటే భిన్నంగా చేయడం కూడా బైడెన్‌కు సవాలుగా మారనుంది. ట్రంప్‌ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించారు.

రెండు ప్యాకేజీలను ప్రకటించారు. మరో ప్యాకేజీపై కూడా త్వరలో సంతకం చేస్తానని వెల్లడించారు. మహమ్మారి కట్టడికి బైడెన్‌ తన ప్రణాళికలు అమలు చేయాలంటే చాలా కష్టమంటున్నారు నిపుణులు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, టెస్టింగ్‌ వంటివి రాష్ట్రాల నుంచి ఫెడరల్‌ ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావడం అతిపెద్ద సవాల్.. ఒక్క రోజే అమెరికాలో 1,28,000 కరోనాకేసులు కొత్తగా నమోదయ్యాయి.



దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 2.40లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనావైరస్‌ టాస్క్‌ఫోర్స్‌ను బైడెన్‌ సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. వైరస్‌ కట్టడి తన తొలిప్రాధాన్యంగా తీసుకునే అవకాశం ఉంది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు భారత మూలాలున్న వివేక్‌ హెచ్‌ మూర్తిని సహ అధ్యక్షుడిగా నియమించవచ్చని భావిస్తున్నారు. మాస్కులు, భౌతిక దూరాన్ని తప్పని సరి చేయాలని రిపబ్లికన్లను, డెమొక్రాటిక్‌ పార్టీ గవర్నర్లను కోరవచ్చని అంటున్నారు.

బైడెన్‌ రాజకీయ జీవితంలో వివిధ రాజకీయ అంశాలపై రిపబ్లికన్లను, డెమొక్రాట్లను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేశారు. ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనంత మంది బైడెన్‌-కమలాకు మద్దతు తెలిపారు. వీరి ప్రణాళికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.



దేశంలో వచ్చిన రాజకీయ చీలికను అర్థం చేసుకొని రిపబ్లికన్లను కూడా ఒప్పించడం బైడెన్‌కు కత్తిమీద సాములాంటింది. రానున్న మూడు నెలల్లో ఆయన అదే పనిలో ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. బైడెన్‌-హారిస్‌ కొవిడ్‌ ప్లాన్‌ను ముందుకు తీసుకెళ్లెందుకు అవసరమైన బ్లూప్రింట్‌ సిద్ధం చేస్తారు. ఆ ప్లాను వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు.

బైడెన్‌ నియమించే కరోనా టాస్క్‌ ఫోర్స్‌కు సహాధ్యక్షత వహిస్తారని భావిస్తున్న 45ఏళ్ల వివేక్‌ మూర్తి అమెరికాలో వైద్యుడు. ఆయన ఒబామా, ట్రంప్‌ హయాంలో దేశానికి సర్జన్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు.



పబ్లిక్‌ హెల్త్‌ సర్వీస్‌ కమిషన్‌ కోర్‌కు వైస్‌ అడ్మిరల్‌ హోదాలో విధులు నిర్వహించారు. డాక్టర్స్‌ ఫర్‌ అమెరికా సంస్థను స్థాపించారు. కర్ణాటక నుంచి యూకేకు వలస వచ్చారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. కొన్ని నెలలుగా ఆయన బైడెన్‌కు కరోనాపై మార్గదర్శకత్వం చేస్తున్నారు.