ప్రచారానికి డబ్బుల్లేవ్: అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న కమలా హ్యారిస్

ప్రచారానికి డబ్బుల్లేవ్: అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్న కమలా హ్యారిస్

Kamala-Harris

ఎన్నికల ప్రచారం చేయడానికి తానేమీ బిలియనీర్ కాదని అందుకే తప్పుకుంటున్నానని కమలా హ్యారిస్(54) తప్పుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవి కోసం 2020లో జరిగే ఎన్నికలకు డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలు, కాలిఫోర్నియా సెనెటర్‌,‌ భారత సంతతికి చెందిన కమలా తప్పుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. 

‘నేను బిలియనీర్‌ను కాదు. ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోతున్నా. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు సరిపడా ఆదాయ వనరులు కూడా లేవు. ముందుకు తీసుకెళ్లాలని అన్ని మార్గాలను అన్వేషించాను. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల వల్ల అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది’ అంటూ తన మద్దతుదారులకు, మీడియా మిత్రులకు ఈ మెయిల్‌ పంపారు. 

2019 జనవరిలో కమలా హ్యారిస్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. మనమంతా కలిసే ఇది పూర్తి చేద్దాం. నాతో కలిసి రండి’ అని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. 

హెల్త్‌కేర్‌ వంటి పథకాలను ఎలా ముందుకు తీసుకువెళ్తామన్న విషయాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో కమల ప్రచార పర్వంలో వెనుకబడ్డారు. పార్టీలోని ఇతర సభ్యులతో పోలిస్తే ఆమె 3.5 శాతం ఓట్లు మాత్రమే సంపాదించి ఆరో స్థానానికి పడిపోయారు. మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్ను, ఇమ్మిగ్రేషన్‌ పాలసీ, హెల్త్‌కేర్‌ సిస్టమ్‌, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం తదితర అంశాలను ప్రచారంలో ప్రస్తావించారు.