జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య…తనదే బాధ్యతన్న సౌదీ యువరాజు

  • Published By: venkaiahnaidu ,Published On : September 26, 2019 / 01:28 PM IST
జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య…తనదే బాధ్యతన్న సౌదీ యువరాజు

సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యపై  సౌదీ యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ మౌనం వీడారు. తన హయాంలోనే ఖషోగ్గి హత్య జరిగిందని,దీనికి తానే బాధ్యత వహిస్తానని సల్మాన్ అన్నారు. వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ అయిన ఖషోగ్గిని బిన్ సల్మాన్ హత్య చేయించాడన్న ఆరోపణలున్నాయి. ఖషోగ్గి మరణించి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా  ఫ్రంట్ లైన్ అనే మీడియా సంస్థ చేసిన డాక్యుమెంటరీలో బిన్ సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్-1,2019ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది.

ఖషోగ్గి సౌదీ లోని ఉన్నత వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి. అంతే కాదు అక్కడి రాచరిక ప్రభుత్వ వర్గాలకు కూడా అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తి కూడా. ఆ తరువాత వారితో విభేదాల నేపథ్యంలో సౌదీ లో తన ప్రాణానికి ఏదో ముప్పు ఉందని భావించి టర్కీ లో నివాసం ఏర్పరుచుకుని తన వృత్తిని కొనసాగిస్తున్నాడు. వాషింగ్టన్ పోస్టు కాలమిస్టుగా కథనాలు రాస్తూ సౌదీ రాచరిక ప్రభుత్వానికి, యువ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు అంతగా నచ్చని కథనాలు రాస్తుండడంతో అతడి పైన సౌదీ పాలకులు తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నట్లు అర్థం అవుతోంది.

అక్టోబర్ 2, 2018న తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్టు తెలిపే పత్రాలపై సంతకం చేయడానికి ఖషోగ్గి  ఇస్తాంబుల్ లోని సౌదీ కాన్సులేట్ లోకి ఖషోగ్గి వెళ్లాడు. ఆ రోజు ఉదయం తాను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్న టర్కీ దేశస్తురాలైన హ్యటిస్ సెంగిజ్ తో కలిసి  రాయబార కార్యాలయానికి వెళ్లాడు.  ఆమెను రాయబార కార్యాలయం వెలుపల వదిలి ఖషోగ్గి ఒక్కడే లోపలికి ప్రవేశించాడు. అలా వెళ్లిన ఖుషోగ్గి ఇంతవరకూ తిరిగి రాలేదు దీంతో ఆమె ఆందోళన చెంది ఈ విషయాన్ని బయటకి తెలియపరిచింది. ఆయనలోని​కి వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో స్పష్టంగా నమోదు అయింది కానీ బయటకి వెళ్ళిన ఆధారాలు ఇంతవరకు లభించలేదు. రాయబార కార్యాలయం లోపలే హత్యచేసి పూడ్చి పెట్టినట్లు టర్కీ పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఇప్పటివరకు ఆయన శవం కూడా దొరకలేదు. 

సౌదీ యువరాజే ఈ హత్య చేయించాడన్న ఆరోపణలు ఉన్నాయి. సౌదీ ప్రభుత్వం ఆదేశాల మేరకు రియాద్ నుంచి వచ్చిన 15 మంది ఏజెంట్లు అంతకు కొన్ని రోజుల ముందే… ఖషోగ్గి రాయబార కార్యాలయానికి వస్తే అతడిని బలవంతంగా తిరిగి సౌదీకి తీసుకెళ్లాలని ఫ్లాన్ చేశారని, దీనికి అతడు తీవ్రంగా ప్రతిఘటించడంతో విచారణ పేరుతో ఆయన్ను దారుణంగా హింసించి ఆ తర్వాత రాయబార కార్యాలయంలోనే హత్యచేసి ఆ పక్కనే ఇంకో గదిలో దేహాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించినట్లు కథనాలు వచ్చాయి. దీనికి సౌదీ అరేబియా ప్రభుత్వ ఉన్నత వర్గాల సహకారం అనుమతి ఉన్నట్లు తెలిపాయి. హత్య తర్వాత వారందరూ ఇస్తాంబుల్ నుంచి సౌదీ అరేబియో ప్రభుత్వానికి చెందిన విమానాల్లో సౌదీకి వెళ్లినట్లు తెలిపాయి.

ఖషోగ్గి హత్యానంతరం ప్రపంచ స్థాయిలో వెల్లువెత్తిన నిరసన సౌదీ అరేబియా దేశాన్ని అక్కడి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ,కొన్ని యూరప్ దేశాలు కూడా సౌదీ యువరాజే ఈ హత్య చేయించినట్లు ఆరోపించాయి. దీంతో అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని తప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ అమెరికా కూడా తన మిత్ర దేశం అని సౌదీ అరేబియా ను చూడకుండా తీవ్రస్థాయిలో స్పందించడంతో ఆ దేశానికి ఏం చేయాలో పాలు పోలేదు. దీంతో సౌదీ అరేబియా అధికార వర్గాలు ఈ హత్యను తమ కిందిస్థాయి ఇంటెలిజెన్స్ అధికారుల పనిగా వారిపై నిందలు వేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది.