ముక్కు, గొంతు ద్వారా కరోనా సోకిన చిన్నారులు వారాల పాటు వైరస్‌ను వ్యాప్తి చేయగలరు.. స్టడీ

  • Published By: naveen ,Published On : August 30, 2020 / 02:06 PM IST
ముక్కు, గొంతు ద్వారా కరోనా సోకిన చిన్నారులు వారాల పాటు వైరస్‌ను వ్యాప్తి చేయగలరు.. స్టడీ

కరోనా వ్యాప్తి గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. చిన్నారులు కరోనా వైరస్ ను కొన్ని వారాల పాటు వ్యాప్తి చేయగలరనే విషయం బయటపడింది. కోవిడ్ బారిన పడిన పిల్లలు నోరు, గొంతు ద్వారా వైరస్ ను వ్యాప్తి చేయగలరని శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కోవిడ్‌-19 సోకిన చిన్నారులు కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తారని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు తెలిపారు. వారిలో లక్షణాలు చాలాకాలం కిందటే తగ్గిపోయిన సందర్భంలోనూ ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. మహమ్మారి వ్యాప్తిలో పిల్లల పాత్ర గురించి కొత్త అంశాలను ఈ పరిశోధన వెలుగులోకి తెచ్చింది.

ఊహించినదాని కన్నా ఎక్కువ కాలం పాటు వైరస్‌కు సంబంధించిన జన్యు పదార్థం ఉంటుంది:
దక్షిణ కొరియాలోని సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వ్యాధి లక్షణాల ఆధారంగా చిన్నారుల్లో కొవిడ్‌-19 కేసులను గుర్తించడం కష్టమవుతోందని వారు తెలిపారు. ఊహించినదాని కన్నా ఎక్కువ కాలం పాటు వారిలో వైరస్‌కు సంబంధించిన జన్యు పదార్థమైన ఆర్‌ఎన్‌ఏ ఉంటోందన్నారు. కరోనా సోకి దక్షిణ కొరియాలోని 22 ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 91 మంది పిల్లలపై వీరు పరిశోధన చేశారు. వీరిలో 22 శాతం మందిలో ఏ దశలోనూ వ్యాధి లక్షణాలు ఉత్పన్నం కాలేదని చెప్పారు. 20 శాతం మందికి తొలుత లక్షణాలు లేనప్పటికీ ఆ తర్వాత అవి తలెత్తాయి. 58 శాతం మందికి.. పరీక్ష చేసేటప్పటికే రుగ్మతలు ఉన్నాయి.

రెండున్నర వారాల పాటు వైరస్ జాడ:
ఈ చిన్నారులను సరాసరిన ప్రతి మూడు రోజులకోసారి పరీక్షించి చూశారు. తద్వారా వారి నుంచి కాలానుగుణంగా వెలువడుతున్న వైరస్‌ స్థాయిని పరిశీలించారు. మూడు రోజుల నుంచి మూడు వారాల పాటు వ్యాధి లక్షణాలు కొనసాగినట్లు తేల్చారు. 91 మందిలోనూ సరాసరిన రెండున్నర వారాల పాటు వైరస్‌ జాడ కొనసాగింది. అయితే వ్యాధి లక్షణాలు లేని వారిలో ఐదో వంతు మందిలో, లక్షణాలున్నవారిలో సగం మందిలో.. మూడో వారంలోనూ వైరస్‌ ఉనికి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

లక్షణాలు ఉన్న చిన్నారుల్లో వైరస్ ఉనికి 17 రోజుల వరకు కనిపించగా, లక్షణాలు లేని చిన్నారుల్లో 14 రోజుల వరకు వైరస్ ఉనికి కనిపించింది. కొన్ని సందర్భాల్లో కోవిడ్ చిన్నారుల్లో వైరస్ ఇంకా ఎక్కువ రోజులు ఉండే అవకాశమూ లేకపోలేదన్నారు. కోవిడ్ సోకిన చిన్నారుల్లో వైరస్ తీవ్రత స్వల్పంగా ఉన్నప్పటికి, లక్షణాలు మాత్రం చాలా రోజుల వరకు ఉంటాయని గుర్తించారు.

మాస్కులు మస్ట్:
అయితే, ఈ స్టడీ ఆధారంగా పిల్లల వల్లే వైరస్ వ్యాప్తి అవుతోందని అనుకోవడం కరెక్ట్ కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పరిశోధన దక్షిణకొరియా దేశానికి సంబంధించినది మాత్రమే. దీనిపై మరింత లోతైన అధ్యయనం అవసరం అని శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణకొరియాలో జరిగినట్టే ఇతర దేశాల్లోనూ పిల్లల విషయంలో ఇలానే జరుగుతోందా లేదా అనేది స్టడీ చేయాల్సి ఉందన్నారు. ఫేస్ మాస్కులు వినియోగించని చోట వైరస్ వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, వ్యాధి లక్షణాలు లేని కరోనా బాధితుల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.