కిమ్ కు ఎలాంటి సర్జరీ జరగలేదు..సౌత్ కొరియా సంచలన ప్రకటన

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2020 / 03:50 PM IST
కిమ్ కు ఎలాంటి సర్జరీ జరగలేదు..సౌత్ కొరియా సంచలన ప్రకటన

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్(36) కు ఎలాంటి సర్జరీలు లేదా ఏ విధమైన మెడికల్ ప్రొసీజర్ జరగలేదని ఆదివారం(మే-3,2020)ఓ దక్షిణకొరియా అధికారి తెలిపారు. కొన్ని రోజుల క్రితం కిమ్ ఒక్కసారిగా కన్పించకుండా పోయేసరికి ఆయనకు హార్ట్ సర్జరీ జరిగిందని,ఆయన కోలుకుంటున్నారని కొందరు,చనిపోయారని కొందకు,కోలుకుంటున్నాడని మరికొన్ని అంతర్జాతీయ వార్తాసంస్థలు కథనాలు ప్రసారం చేశాయి.

అయితే ప్రపంచవ్యాప్తంగా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ శుక్రవారం కిమ్ జోంగ్ ఉన్ ప్రజల మధ్యకు వచ్చాడు. రాజధాని ప్యాంగ్యాంగ్ కు సమీపంలో ఓ ఎరువుల ఫ్యాక్టరీని కిమ్ ప్రారంభిన ఫొటోలు,వీడియోను ఆ దేశ మీడియా శనివారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే శుక్రవారం ఓ సీనియర్ సౌత్ కొరియన్ ప్రెసిడెన్సియల్ అధికారి కిమ్ రీఎంట్రీపై మాట్లాడుతూ…కిమ్ కు ఎలాంటి సర్జరీ జరగలేదని తమకు సమాచరమందిందన్నారు. అంతేకాకుండా కిమ్ కు అసలు ఎలాంటి మెడికల్ ప్రొసీజర్ జరుగలేదని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత రహస్య దేశాలలో ఒకటైన ఉత్తర కొరియాలోని పరిణామాలను ధృవీకరించడంలో దక్షిణ కొరియాకు మంచి రికార్డ్ ఉంది. కొన్ని రోజుల క్రితం వారాల్లో కిమ్ ఆరోగ్యం గురించి పుకార్లు వెలువడినప్పుడు, దక్షిణ కొరియా ప్రభుత్వం వాటిని నిరాధారమైనదిగా కొట్టిపారేసింది. ఉత్తర కొరియా నుంచి ఎటువంటి అసాధారణ సంకేతాలు లేవని ఆ సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, ఏప్రిల్-15న ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే ముఖ్యమైన తన తాత,ఉత్తర కొరియా జాతిపిత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు  కిమ్  హాజరుకాకపోవడంతో ఆయన ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏటా దేశంలో పండుగలా జరిపే తన తాత జయంతి ఉత్సవాలకు తప్పనిసరిగా హాజరయ్యే కిమ్… ఈ సారి మాత్రం గైర్హాజరయ్యాడు.

అయితే కిమ్ పబ్లిక్ లో కన్పించకుండా పోవడం ఇదే మొదటిసారి కాదు. 2014లో కూడా ఇలానే కనిపించకుండా పోయిన కిమ్ ఆ తర్వాత ఒక నెలకు కుంటుతూ కనిపించాడు. అయితే ఇప్పుడు కిమ్ అదృశ్యానికి గల కారణాలను ఉత్తరకొరియా ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే కిమ్ జాంగ్ ఉన్‌ పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజల ముందుకు రావడం ఆనందంగా ఉందంటూ శనివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. కిమ్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కూడా ట్రంప్‌ చెప్పారు.