Food Crisis : వామ్మో.. కాఫీ రూ.7వేలు, అర‌టిపండ్లు రూ.3వేలు.. ఎక్కడో తెలుసా?

ఉత్తర కొరియాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిత్యావసరాల సరకుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ముఖ్యంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి. సరిహద్దుల్లో ఆంక్షలు, దేశంలో వరదల

10TV Telugu News

North Korea Food Crisis : ఉత్త‌ర కొరియాలో ఆహార సంక్షోభం ముదిరిపోయింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా అధికారికంగా అంగీకరించారు. దేశంలో ఆహార కొరత తీవ్రంగా ఉందని, ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారని ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశంలో తుఫానులు, వరదలు కారణంగా తగినంత ఆహారాన్ని ఆ దేశం ఉత్పత్తి చేయలేకపోయింది. దీంతో ఉత్తరకొరియాలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఉత్తర కొరియా వార్తా సంస్థ ఎన్‌కె న్యూస్ ప్రకారం.. కిలో అర‌టిపండ్లు మూడు వేల రూపాయలకు అమ్ముతున్నారు. మరోవైపు దేశం సరిహద్దులు మూసివేయడంతో, దిగుమతులు లేవు. చైనాతో వ్యాణిజ్య సంబంధాలు తగ్గగా సంక్షోభం తీవ్రమైందని చెబుతున్నారు. మాములుగా అయితే, ఆహారం, ఎరువులు, ఇంధనం చైనా నుంచి భారీగా దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు దిగుమతులు ఆగిపోవడంతో సంక్షోభం ముదిరింది.

ఒక బ్లాక్‌ టీ ప్యాకెట్‌ ధర రూ.5 వేలు(70డాలర్లు), కాఫీ ప్యాకెట్‌ ధర రూ.7 వేలు(100డాలర్లు), కిలో అరటిపండ్ల (దాదాపు 7 అరటిపండ్లు) ధర 3వేలకు పైనే (45డాలర్లు). ఇవీ.. కిమ్‌ సామ్రాజ్యంలో తాజా ధరలు. ఉత్తర కొరియా దాదాపు 8 లక్షల 60 వేల టన్నుల ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార విభాగం (FAO) అంచనా వేసింది. ఇది ఆ దేశానికి రెండు నెలలపాటు సరిపోయే అహార పదార్థాలతో సమానం. ఇక ఈ ఏడాది ఉత్తర కొరియా 13 లక్షల టన్నుల ఆహార కొరత ఎదుర్కొంటోందని దక్షిణ కొరియా ప్రభుత్వ సంస్థ అంచనా వేసింది.

ఇలాంటి నివేదికల నేపథ్యంలో.. తాజాగా జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడిన కిమ్‌.. దేశంలో ఆహార సరఫరా ఆందోళన కలిగిస్తోందని అన్నారు. వెంటనే ఆహారోత్పత్తి గణనీయంగా పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించడం అక్కడి తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొవిడ్‌ ఆంక్షలు మరికొంత కాలం కొనసాగించాలని అధినేత కిమ్‌ నిర్ణయించడం గమనార్హం.

సేంద్రీయ ఎరువు కోసం మూత్రం..?
రసాయన ఎరువుల కోసం చైనాపై ఆధారపడిన ఉత్తర కొరియా.. దిగుమతులపై ఆంక్షలతో తీవ్ర ఎరువుల కొరత ఎదుర్కొంటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు సేంద్రీయ ఎరువుల తయారీని ప్రత్యామ్నాయంగా భావించింది. సేంద్రీయ ఎరువుల తయారీని వేగంగా చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కంపోస్టులో కలిపేందుకు నిత్యం దాదాపు రెండు లీటర్లు మూత్రాన్ని ఇవ్వాలని అక్కడి రైతులకు ఉత్తరకొరియా అధికారులు సూచించారని అమెరికాకు చెందిన రేడియో ఫ్రీ ఆసియా అనే వార్తా సంస్థ తెలిపింది.

మరోవైపు కరోనా భయంతో వణికిపోతున్న ఉత్తర కొరియా గతేడాది దేశ సరిహద్దులను మూసివేసింది. అటు కీలక వాణిజ్య కేంద్రంగా ఉన్న చైనాతోనూ దిగుమతులను నియంత్రించింది. మునుపటితో పోలిస్తే చైనాతో వాణిజ్యం దాదాపు 90శాతం తగ్గిపోగా.. కేవలం కొన్ని అత్యవసర సరకులు, వస్తువుల దిగుమతిని మాత్రమే అనుమతిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఉత్తరకొరియాలో సంభవించిన తుపాను, వరదలకు అక్కడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఓవైపు కొవిడ్‌ ఆంక్షలు, మరోవైపు ప్రకృతి ప్రకోపం ఉత్తర కొరియా ఆహార ఉత్పత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.