అప్పుడే అయిపోలేదు, 2023 వరకు కరోనావైరస్ మనతోనే ఉంటుంది, ప్రముఖ సైంటిస్ట్ హెచ్చరిక

  • Published By: naveen ,Published On : September 6, 2020 / 01:29 PM IST
అప్పుడే అయిపోలేదు, 2023 వరకు కరోనావైరస్ మనతోనే ఉంటుంది, ప్రముఖ సైంటిస్ట్ హెచ్చరిక

కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 8 నెలలుగా ఈ మహమ్మారి ప్రజలను పీడిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. లక్షలాది మందిని కోవిడ్ బలితీసుకుంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా, కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కాగా, కరోనావైరస్ మహమ్మారి గురించి జర్మనీకి చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ షాకింగ్ న్యూస్ చెప్పారు. అప్పుడే అయిపోలేదు, మరో మూడేళ్లు అంటే 2023 వరకు కరోనా మనతోనే ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు.

ఇళ్ల మధ్య కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది అనే దానిపై ప్రముఖ జర్మన్ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ హెండ్రిక్ స్ట్రీక్ స్టడీ చేశారు. కరోనావైరస్ మరో మూడేళ్ల పాటు మనతోనే ఉంటుందని స్టడీలో గుర్తించారు. వ్యాక్సిన్ వచ్చినా నమ్మకం లేదని, కరోనా రాదని గ్యారంటీ లేదని చెప్పారు. ప్రజలు తమ జీవన శైలిని మార్చుకోవాలని, కరోనాతో సహజీవనం చేయడం నేర్చుకోవాలని సూచించారు. 2023 వరకు కరోనా వైరస్ మనతోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

స్కాట్లాండ్ లో అనూహ్యంగా కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరిగాయి. ముఖ్యంగా గ్లాస్ గో, వెస్ట్ డన్ బార్ట్ షైర్ లో కేసులు విపరీతంగా పెరిగాయి. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ప్రజలు ఎవరి ఇళ్లలో వారు ఉండాలి. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లడం నిషేధించారు. అలాగే నివాస ప్రాంతాల్లో సమూహ సమావేశాలపైనా బ్యాన్ విధించారు.

జర్మనీలో కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన హీన్స్ బర్గ్ ను ప్రొ.స్ట్రీక్ ఎంచుకున్నారు. అక్కడ కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందింది, దాన్ని ఏ విధంగా కట్టడి చేయొచ్చు అనేదానిపై ఆయన స్టడీ చేశారు. ఇళ్లలో చేసుకునే విందులు, వేడుకలపై ఆంక్షలు విధించడం ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించొచ్చని బాన్ యూనివర్సిటీ, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ హెచ్ఐవీ రిసెర్చ్ డైరెక్టర్ చెప్పారు.

వైరస్ మాయం కాలేదు, ఇప్పుడది ప్రజల జీవితాల్లో భాగంగా మారింది అని స్ట్రీక్ చెప్పారు. మరో మూడేళ్లు కరోనా వైరస్ మనతోనే ఉంటుంది, దాంతో కలిసి జీవించడానికి మనం ఒక మార్గాన్ని కనుగొనాలని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని విపరీతంగా పెంచే వేడుకలను ముందుగా ఆపేయడం చాలా ముఖ్యం. ప్రజలు గుంపులుగా చేరి పార్టీలు చేసుకోవడం వల్ల వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. భౌతిక దూరం పాటించాలి. సమూహాలుగా ఏర్పడకూడదు. కచ్చితంగా నోటిని, ముక్కుని మూసివేసేలా మాస్కు ధరించాలి అని స్ట్రీక్ అన్నారు.

ఇలాంటి చిన్న చిన్న చర్యలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సాయపడుతాయని ఆయన చెప్పారు. స్ట్రీక్స్ అధ్యయనం ఏప్రిల్ లో పబ్లిష్ అయ్యింది. వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఇళ్లలో జరుపుకునే వేడుకలు, విందులు, సమావేశాలే అని ఆయన తేల్చి చెప్పారు.

కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు బాగా ప్రభావితమైన దేశాల్లో జర్మనీ ఒకటి. అక్కడ 9వేల 401మంది కరోనాతో చనిపోయారు. కాగా, కరోనాను కట్టడి చేయడంలో జర్మనీ సక్సెస్ అయ్యింది. యూరప్ లో మిగతా దేశాలతో పోలిస్తే జర్మనీ ఎంతో మెరుగ్గా కరోనాకు అడ్డుకట్ట వేయగలిగింది. అయితే, అంతా అదుపులో ఉంది అని ఆనందించే లోపు జర్మనీలో మరోసారి కరోనా వైరస్ విజృంభించింది. గణనీయంగా కేసులు పెరిగాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం శీతాకాలంలో మరోసారి లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది.

కరోనాను అంతం చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం. కానీ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పడం కష్టం. వచ్చే ఏడాది వ్యాక్సిన్ రావొచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ సమయమే పట్టొచ్చు. అందరికి అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది అని ప్రొ.స్ట్రీక్ అన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీపైనా(మంద రోగనిరోధక శక్తి) ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హెర్డ్ ఇమ్యూనిటీ మంచిదే కానీ, ప్రజలను బలవంతంగా కరోనా వైరస్ బారిన పడేలా చేస్తున్నట్లు అనిపిస్తుందన్నారు. అంతిమంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, కరోనావైరస్.. వ్యక్తి నుండి వ్యక్తికి మరియు ఇంటి నుండి ఇంటికి వ్యాపించకుండా ఉండటానికి చేయగలిగినదంతా చేయాలని ప్రొ.స్ట్రీక్ స్పష్టం చేశారు.