Leaving Office Early Salary Cut : శాలరీ కట్.. పనిగంటల కంటే 2నిమిషాల ముందే ఇంటికెళ్లిపోతున్న ఉద్యోగులకు ప్రభుత్వం షాక్

Leaving Office Early Salary Cut : శాలరీ కట్.. పనిగంటల కంటే 2నిమిషాల ముందే ఇంటికెళ్లిపోతున్న ఉద్యోగులకు ప్రభుత్వం షాక్

Leaving Office Early Salary Cut

Leaving Office 2 Mins Early In Japan: ఏదైనా పని పడితే.. కొందరు ఉద్యోగులు ఆఫీసు పని గంటలు పూర్తికాక ముందే తొందరగా ఇంటికి వెళ్లిపోవడం చూస్తూనే ఉంటాం. ఇది మన ఇండియాలో ప్రభుత్వ ఆఫీసుల్లో కామన్. పైగా, పెద్ద నేరం కూడా కాదు. కానీ, జపాన్ లో మాత్రం అలా కాదు. ఇలా చేయడం అక్కమ ముమ్మాటికీ తప్పే. అందుకు శిక్ష కూడా ఉంటుంది. జపాన్‌లోని ఓ ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగులు పనిగంటల కంటే రెండు నిమిషాల ముందు ఇంటికి వెళ్లిపోతున్నారని తెలిసి ప్రభుత్వం వారికి షాక్ ఇచ్చింది. ఏకంగా జీతాల్లో కోత విధించింది.

జపాన్‌లోని చిబాలో ఫునబషి నగర విద్యాశాఖ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ పనిచేసే కొంత మంది ఉద్యోగులు మే 2019 నుంచి జనవరి 2021 కాలం మధ్య 316 సార్లు ఆఫీసు టైం కంటే రెండు నిమిషాలు ముందుగా ఇంటికి వెళ్లిపోయారట. అంతేకాదు, వారి విధుల సమయాన్ని రికార్డుల్లో తప్పుగా నమోదు చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ కార్యాలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న అసిస్టెంట్‌ సెక్షన్‌ చీఫ్‌ అధికారిణే ఇందుకు బాధ్యురాలిగా తేలింది.

ఆమె తొందరగా వెళ్లడమే కాకుండా.. ఆమె ప్రోత్సాహంతోనే ఇతర ఉద్యోగులు కూడా ఆఫీస్‌ టైం కంటే ముందే వెళ్తుండటంపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. ఈ ఘటనలో ప్రధాన బాధ్యుల జీతాల్లో మూడు నెలలపాటు పదిశాతం కోత విధిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే మరికొందరు ఉద్యోగులకు హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసింది.

వాస్తవానికి సాయంత్రం 5.15కి ఆఫీసు ముగుస్తుంది. ఉద్యోగులు ఆ సమయానికి ఇంటికి వెళ్లాలి. అయితే వారు సా.5.13కే ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. దీనికి కారణం ఏంటంటే.. 5.17కి ఓ బస్సు ఉంటుంది. దాన్ని అందుకోవడానికి ఉద్యోగులు పనిగంటల కన్నా ముందుగానే ఆఫీస్ నుంచి వెళ్లిపోతున్నారని గుర్తించారు. 5.17కి వచ్చే బస్సు మిస్ అయితే, అరగంట వరకు మరో బస్సు లేదు. అందుకే ఉద్యోగులు ముందే ఇంటికి వెళ్లిపోవడం స్టార్ట్ చేశారు.

జపాన్‌లో సంస్థలైనా, ప్రభుత్వమైనా పని విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాయని తెలిసిందే. సమయపాలన పాటించకపోవడాన్ని అస్సలు ఊరుకోవు. అక్కడి రైళ్లు కాస్త ఆలస్యమైనా రైల్వే అధికారులు ప్రయాణికులకు క్షమాపణ చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఆలస్యానికి రైలే కారణమని ప్రయాణికులకు ధ్రువీకరణ పత్రాలు కూడా ఇస్తుంటారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆఫీసుల్లో సమయపాలన ఏ విధంగా ఉంటుందో. సమయ పాలన పాటించని ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడాన్ని, జీతాల్లో కోత విధించడాన్ని జనాలు సమర్ధిస్తున్నారు. ఇది సరైన చర్య అంటున్నారు. మాటలతో చెబితే మారరని, ఇలా జీతాల్లో కోత విధిస్తేనే దారికొస్తారని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు, ఇలాంటి సమయపాలన, కఠిన చర్యలు మన దేశంలోనూ ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసుల్లో అమలు చేస్తే చాలా బాగుంటుందని జనాలు అంటున్నారు.