ముంబై పేలుళ్ల సూత్రధారికి జైలు శిక్ష

ముంబై పేలుళ్ల సూత్రధారికి జైలు శిక్ష

LeT commander Zaki-ur-Rehman Lakhvi : ముంబై పేలుళ్ల ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. 166 మంది ప్రాణాలు కోల్పోవడం, వందలా మంది క్షతగాత్రులు అవడంతో భారతదేశంతో పాటు ప్రపంచం ఉలిక్కిపడింది. దీనికంతటికీ సూత్రధారి, లష్కరే కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ అని తేల్చింది. ఇతనికి పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇతనికి 61 ఏళ్లు. ముంబై దాడుల కేసులో 2015 నుంచి ఇతను బెయిల్ పై ఉన్నాడు. ఉగ్రవాదులకు ఆర్థిక నిధులు అందిస్తున్నాడన్న ఆరోపిస్తూ..ఉగ్రవాద నిరోధక చట్టం 1977 కింద 15 ఏళ్ల క్రితం లఖ్వీపై సీటీడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలు రావడంతో..పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన సీడీటీ అతడిని అరెస్టు చేసింది. లాహోర్ లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం (ఏటీసీ) లఖ్వీని దోషిగా తేల్చింది. ఒక్కో అభియోగం కింద ఐదు సంవత్సరాల చొప్పున 15 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష విధిస్తూ..న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అంతేగాకుండా..ఒక్కో అభియోగం కింద..లక్ష రూపాయల జరిమానా విధించారు. ఈ జరిమానాను చెల్లించకుంటే…అదనంగా..ఒక్కోదానిలో ఆరు నెలల చొప్పున మరో ఏడాదిన్నర పాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో వెల్లడించారు.

2008లో ముంబాయి, తాజ్ హోటల్ లో ఉగ్రబృందం కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఇందులో 166 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచం మొత్తం దిగ్ర్భాంతికి గురైంది. ఈ మారణకాండలో పది మంది ఉగ్రవాదులు పాల్గొనట్లు నిర్ధారించారు. ఈ కేసులో కరడుగట్టిన ఉగ్రవాది కసబ్‌కు ఇప్పటికే ఉరిశిక్ష అమలైంది.