Lion : వీధుల్లో మృగరాజు షికారు.. ఆందోళనలో ప్రజలు

అడవిలో ఉండాల్సిన సింహం జనావాసాల్లోకి వచ్చింది. ఎంచక్కా వీధుల్లో చక్కర్లు కొట్టింది. వీధుల్లో మృగరాజు సంచరిస్తున్న పిక్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Lion : వీధుల్లో మృగరాజు షికారు.. ఆందోళనలో ప్రజలు

Lion Wanders

Lion Wanders : అడవిలో ఉండాల్సిన సింహం జనావాసాల్లోకి వచ్చింది. ఎంచక్కా వీధుల్లో చక్కర్లు కొట్టింది. వీధుల్లో మృగరాజు సంచరిస్తున్న పిక్స్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంబోడియాలో ఈ ఘటన జరిగింది. అడవిలో ఉండాల్సిన సింహం వీధుల్లో కనిపించడం స్థానికులను భయకంపితులను చేసింది.

వివరాల్లోకి వెళితే.. ఓ చైనీస్ బిజినెస్ మ్యాన్ ఆ సింహాన్ని పెంచుకుంటున్నాడు. ఆ సింహామే ఇలా వీధుల్లోకి వచ్చి షికారు చేసింది. స్థానికులు యజమాని తీరుని తప్పుపడుతున్నారు. తన పెంపుడు సింహాన్ని ఇలా వీధుల్లోకి వదిలేయడం సరికాదని చెబుతున్నారు. ఇది చాలా క్రూరమైన చర్య అన్నారు.

కాగా, గతంలోనూ ఈ సింహం వార్తల్లోకి ఎక్కింది. బాగా డబ్బున్న చైనీస్ వ్యాపారి మురిపెంగా పెంచుకుంటున్న సింహాన్ని జూన్ 27న అధికారులు స్వాధీనం చేసుకుని రెస్క్యూ సెంటర్ కి తరలించారు. టిక్ టాక్ లో తను ఆ సింహంతో ఉన్న వీడియోలను ఆ యజమాని పోస్ట్ చేయడంతో అతని ఇంటికి వెళ్లిన అధికారులు ఆ జంతువును తీసుకుపోయారు. దీంతో యజమాని లబోదిబోమన్నాడు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని, తన సింహాన్ని తనకు ఇప్పించాలంటూ ఏకంగా దేశ ప్రధానిని కోరాడు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ఆయన ‘దయతో.. సింహాన్ని ఆ యజమానికి తిరిగి ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. దాంతో వారు మళ్ళీ దాన్ని తిరిగి అతనికి అప్పగించక తప్పలేదు.

అయితే దాన్ని బోనులో ఉంచాలని ఆదేశించారు. కాంబోడియాలో సంపన్నులు.. క్రూర మృగాలను ఇలా పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ ఉంటారు. ఇందుకు వారు లైసెన్స్ తీసుకోవలసి ఉంటుంది. అయితే వీటిని విచ్చల విడిగా వదిలేయరాదన్న రూల్ ఉంది. కానీ, కొందరు వ్యక్తులు క్రూర మృగాలను నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు.