కోట్లు కొల్లగొడుతున్న యాప్స్‌ను పసిగట్టిన చిన్నారి, గూగుల్‌కు గొప్ప సాయం చేసింది, కోట్ల రూపాయల ఆదాయాన్ని కాపాడింది

  • Published By: naveen ,Published On : September 24, 2020 / 03:06 PM IST
కోట్లు కొల్లగొడుతున్న యాప్స్‌ను పసిగట్టిన చిన్నారి, గూగుల్‌కు గొప్ప సాయం చేసింది, కోట్ల రూపాయల ఆదాయాన్ని కాపాడింది

చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లోని ఒక చిన్న అమ్మాయి అద్భుతం చేసింది. భద్రతా పరిశోధకులే నివ్వెరపోయేలా మాల్ వేర్ గుర్తించి, కోట్లను దోచేసిన కేటుగాళ్లను పట్టించింది. తద్వారా టెక్ సంస్థలు నష్టపోతున్న కోట్ల రూపాయల ఆదాయాన్ని కాపాడింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లోని యాప్స్ భద్రతపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్కామర్ల ముప్పు తప్పడం లేదు. పిల్లలను లక్ష్యంగా ఈ యాప్స్ 2.4 మిలియన్లకు పైగా సార్లు డౌన్‌లోడ్ అయినట్టు పరిశోధకులు కనుగొన్నారు.

గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఏడు నకిలీ యాప్స్‌ ద్వారా ఇప్పటివరకు 5 లక్షల డాలర్లను (సుమారు రూ.3.7 కోట్లు) దోచేశారు. ప్రధానంగా టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో ఈ మోసపూరిత యాప్స్‌కు సంబంధించిన ప్రకటన ప్లే అవుతాయట. ఇవి సాధారణంగా ఎవరికీ కనిపించకుండా మాల్‌వేర్ ద్వారా లోప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తాయి. ఈ యాప్స్ ద్వారా ఒక్కో యూజర్ ద్వారా 10 డాలర్ల మధ్య ఆర్జిస్తున్నాయి.

అయితే టిక్‌టాక్‌లో ఇలాంటి యాడ్స్ చూసిన ఒక పాప ఈ విషయమై ఫిర్యాదు చేసింది. పిల్లలు ఆన్‌లైన్‌లో ఎలా సేఫ్‌గా ఉండాలో తెలిపే అవాస్ట్ ‘బీ సేఫ్’ ఆన్‌లైన్ ప్రాజెక్టుకు దీన్ని రిపోర్ట్ చేసింది. దీంతో వారు రంగంలోకి మరింత పరిశోధించడంతో విషయం వెలుగు చూసింది.

ఇవి వాల్‌పేపర్, మ్యూజిక్ లేదా ఎంటర్ టైన్ మెంట్ యాప్స్ ముసుగులో ఉంటాయని, వీటి ద్వారానే యాడ్‌వేర్ స్కామ్‌లు జరుగుతున్నట్లు సెన్సార్ టవర్‌కు సంబంధించిన పరిశోధకులు తెలిపారు. అంతేకాదు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్స్‌లో లక్షల్లో ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం బాధాకరమైన విషయమని పరిశోధకులు అన్నారు. 5 వేల నుంచి 33 లక్షల వరకు ఫాలోవర్లు ఉన్నవారు కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారట.

దీన్ని తమ దృష్టికి తీసుకొచ్చిన చిన్నారికి అవాస్ట్ ధన్యవాదాలు తెలిపింది. అలాగే పరిశోధకుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న గూగుల్ వెంటనే ప్లేస్టోర్ నుంచి ఈ యాప్స్‌ను తొలగించింది. కాగా, దీనిపై యాపిల్ ఇంతవరకు స్పందించ లేదు.