నారింజ రంగులోకి మారిన ఆకాశం…బీచ్ కు పరుగెత్తిన వేల మంది

  • Published By: venkaiahnaidu ,Published On : December 31, 2019 / 03:34 PM IST
నారింజ రంగులోకి మారిన ఆకాశం…బీచ్ కు పరుగెత్తిన వేల మంది

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు సంక్షోభం మంగళవారం(డిసెంబర్-31,2019)తీవ్రతరమైంది. ఆగ్నేయంలోని తీరప్రాంత పట్టణాలు మంటలు చెలరేగడంతో వేలాది మంది స్థానికులు, పర్యాటకులు బీచ్ లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. కార్చిచ్చు వేడిని త‌ట్టుకోలేని ప్ర‌జ‌లు..స‌ముద్ర తీరం దిశ‌గా ప‌రుగులు తీశారు. సుమారు నాలుగు వేల మంది విక్టోరియా బీచ్ వ‌ద్ద త‌ల‌దాచుకుంటున్న‌ారు..

మెల్‌బోర్న్‌కు తూర్పున సుమారు 500 కిలోమీటర్ల దూరాన విక్టోరియా రాష్ట్రంలో మల్లకూట అనే పర్యటక పట్టణం ఉంది. చాలా మంది ఆస్ట్రేలియన్లు ఈ తీర ప్రాంతానికి విహారానికి వస్తారు. మంగళవారం ఉదయం ఈ ప్రాంతాన్ని కార్చిచ్చు కమ్మేసింది. స్థానికులు నిద్రలేచే సరికి అంతటా దట్టమైన పొగ ఆవరించి ఉంది. ఆకాశం నారింజ పండు రంగులో కనిపించింది. తొమ్మిదిన్నరకల్లా నింగి నల్లగా మారిపోయింది.  ప్రజలందరూ నీటి దగ్గరకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. దీంతో వేల మంది ప్రజలు బీచ్‌కు పరుగులు తీయగా, మంటలార్పే సిబ్బంది వారిని అనుసరించారు. అదే సమయంలో కొంత మంది బోట్లలో ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. పొగ నుంచి రక్షణ కోసం చాలా మంది మాస్కులు ధరించారు. మంగళవారం ఉదయం 10:30 గంటల సమయానికి మల్లకూట రేవు దగ్గర నీటి అంచున ప్రజలు గడపాల్సి వచ్చింది. మరోవైపు అత్యవసర సేవల సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు. 

విపత్తు పర్యవసానాలను ఎదుర్కోవడానికి తాము సిద్ధమవుతున్నామని ఓ స్థానికుడు తెలిపారు. నల్లటి పొగ కమ్మేయడంతో పగలే రాత్రిలా అయ్యిందన్నారు. తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నామన్నారు. మల్లకూటలో చిక్కుకుపోయిన వారికి ఆహారం, నీరు అందించేందుకు, విద్యుత్ సదుపాయం కల్పించేందుకు నౌకాదళ ఓడలను పంపే అవకాశముందని విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ తెలిపారు. కార్చిచ్చు వ‌ల్ల ఆస్ట్రేలియాలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 12కు చేరుకున్న‌ది. విక్టోరియాలో న‌లుగురు ఆచూకీ లేకుండాపోయారు.