భారత్ ‘మురికి’ దేశం…మళ్లీ నోరు జారిన ట్రంప్

  • Published By: venkaiahnaidu ,Published On : October 23, 2020 / 03:43 PM IST
భారత్ ‘మురికి’ దేశం…మళ్లీ నోరు జారిన ట్రంప్

Look At India, It’s Filthy: Trump భారత్ పై మరోసారి నోరు పారేసుకున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇండియాను మిత్ర దేశంగా, ప్రధాని మోడీని మంచి స్నేహితుడిగా చెప్పుకునే ట్రంప్..భారత్‌ను మురికి దేశంగా అభివర్ణించారు. భారత్ లో స్వచ్ఛమైన గాలి లేదని..మురికి గాలి ఉందని ఆరోపించారు.

నవంబర్-3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా… అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మధ్య నాష్‌ విల్లేలో అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9 గంటలకు రెండవ(ఇదే చివరిది కూడా)చివరి ప్రెసిడెన్షియల్ డిబెట్‌ జరిగింది. ఇద్దరు అభ్యర్థులు పర్యావరణ మార్పులపై చర్చించారు.



ఈ సందర్భంగా ట్రంప్ భారత్‌ పై భారత్‌పై విమర్శనాత్మకంగా మాట్లాడారు. పర్యావరణాన్ని భారత్ కలుషితం చేస్తోందని ఆరోపించారు. కాలుష్య కారకాలను భారత్, చైనా, రష్యా దేశాలు విపరీతంగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని.. తద్వారా పర్యావరణం కలుషితం అవుతోందని ట్రంప్ విమర్శించారు. చైనాను చూడండి ఎంత మురికిగా ఉందో. అలాగే రష్యా, భారత్‌లను చూడండి అవి ఎంత మురికిగా ఉన్నాయో. అక్కడ గాలి కూడా మురికిగా ఉంటుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.



ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ట్రంప్.. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగడానికి సంబంధించి తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. ఆ ఒప్పందం వల్ల అమెరికా ఎటువంటి ప్రయోజనం లేకపోగా.. కోట్లాది రూపాయలను నష్టపోతుందని తెలిపారు. మిలియన్ల కొద్ది ఉద్యోగాలను వేలాది కంపెనీలను నష్టం పోవడం ఇష్టం లేకే.. పారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.



ఇటువంటి వాతావరణ ఒప్పందాల వల్ల టెక్సాస్, ఓక్లాహోమా వంటి చమురు రాష్ట్రాలకు ఆర్థిక విపత్తు ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి డెమొక్రాటిక్ అభ్యర్థి బిడెన్ ప్రణాళికలను ఆయన తప్పుబట్టారు. అమెరికాలో స్వచ్ఛమైన గాలి, నీరు ఉందని.. కార్బన్ ఎమిషన్స్ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉందన్నారు. కాగా.. గ్లోబల్ వార్మింగ్‌ను సాధ్యమైనంత వరకు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాల మధ్య 2015లో పారిస్ ఒప్పందం కుదురిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటుందని ట్రంప్ గతంలో ప్రకటించారు.

ఇక, తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో కూడా భారత్‌పై ట్రంప్ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. కరోనా మరణాల సంఖ్యపై భారత ప్రభుత్వం కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు.