జనవరి 10న చంద్ర గ్రహణం : ప్రపంచవ్యాప్తంగా కనిపించనుంది

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 05:24 AM IST
జనవరి 10న చంద్ర గ్రహణం : ప్రపంచవ్యాప్తంగా కనిపించనుంది

జనవరి 10న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. శుక్రవారం (జనవరి 10, 2020) రాత్రి 10.30 గంటల నుంచి 11వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటల వరకు గ్రహణం కనిపించనుంది. మొత్తం నాలుగు గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ఖండాల్లో చంద్ర గ్రహణం కనిపించనుంది. అయితే ఈ ఏడాది జూన్‌లో రెండు గ్రహణాలున్నాయి. జూన్‌ 5న సంపూర్ణ చంద్రగ్రహణం, 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడతాయి.

దేశవ్యాప్తంగా గురువారం(డిసెంబర్ 26, 2019) సూర్యగ్రహణం కనువిందు చేసింది. మూల నక్షత్రం ధనస్సు రాశిలో ఏర్పడిన కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం మూడు గంటల పాటు సాగింది. ఉదయం 8.03 గంటలకు ప్రారంభమైన గ్రహణం.. ఉ.11.11 గంటలకు ముగిసింది. భారత్‌ తోపాటు ఆసియాలోని పలు దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. కాగా, సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాలను బుధవారం(డిసెంబర్ 25,2019) రాత్రే మూసివేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం, సంప్రోక్షణ తర్వాత తిరిగి తెరిచారు. 

సూర్యగ్రహణం రోజున మూఢ నమ్మకాలు వెలుగు చూశాయి. పలు ప్రాంతాల్లో ఘోరాలు జరిగాయి. కొందరు మూఢ నమ్మకంతో వ్యవహరించారు. కర్నాటక రాష్ట్రంలో ఇలాంటి ఘోరమే జరిగింది. విజయ్ పూర్ జిల్లా అర్జునగి పీకే గ్రామంలో స్థానికులు వింతగా వ్యవహరించారు. అంగ వైకల్యంతో బాధపడుతున్న పిల్లలను మట్టిలో పాతిపెట్టారు. మెడ వరకు వారిని మట్టిలో పాతారు. గ్రహణం రోజున ఇలా చేస్తే అంగ వైకల్యం పోతుంది అనే నమ్మకంతో తాము ఇలా చేశామని తల్లిదండ్రులు చెప్పారు. వారు చేసిన పని అందరిని విస్తుపోయేలా చేసింది. ఇదంతా మూఢ నమ్మకం అని, అలా చేయడం వల్ల అంగ వైకల్యం పోదని మేధావులు చెప్పారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలని, ఆ ఊరి ప్రజల్లో చైతన్యం నింపాలని కోరారు. 

మరోవైపు ఏపీలోని అనంతపురం జిల్లాలోనూ ఇలాంటి వింత నమ్మకమే కనిపించింది. గ్రహణం రోజు కావడంతో మహిళలు జిల్లెడు చెట్టుకి తాయెత్తులు కట్టారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. గ్రహణ సమయంలో వారు ఈ పని చేశారు. కళ్యాణదుర్గంలో ఈ ఘటన జరిగింది. సూర్యగ్రహణం రోజున అరిష్టం జరక్కుండా ఉండేందుకు జిల్లెడు చెట్టుకి తాయెత్తులు కట్టి పూజలు చేశామని వారు చెప్పారు. కాగా, ఇదంతా మూఢ నమ్మకమే అని జనవిజ్ఞాన వేదిక సభ్యులు స్పష్టం చేశారు. గ్రహణం రోజున అరిష్టం జరుగుతుందనేది అపోహ మాత్రమే అన్నారు.