Made In China M-16 Rifle : భారత్‌ను దెబ్బకొట్టేందుకు చైనా కుట్ర..? పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా..!

చైనా.. భారత్ ను దొంగ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందా? నేరుగా టెర్రరిస్టులకు ఆయుధాలు సప్లయ్ చేస్తోందా? జమ్ముకశ్మీర్ లోని ఉరిలో చొరబాటుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను మన జవాన్లు మట్టుబెట్టారు. అయితే వారి దగ్గర చైనా మేడ్ ఎం16 రైఫిల్స్ దొరకడం ఆందోళనకు గురి చేస్తోంది.

Made In China M-16 Rifle : భారత్‌ను దెబ్బకొట్టేందుకు చైనా కుట్ర..? పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా..!

Made In China M-16 Rifle : దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్-చైనా చేస్తున్న ఉగ్ర కుట్రలను భారత బలగాలు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూనే ఉన్నాయి. ఎలాగైనా భారత్ లోకి చొరబడి దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న టెర్రరిస్టులకు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్ లోని ఉరిలో చొరబాటుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను మన జవాన్లు మట్టుబెట్టారు. అయితే వారి దగ్గర చైనా మేడ్ ఎం16 రైఫిల్స్ దొరకడం ఆందోళనకు గురి చేస్తోంది.

బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్ కమల్ కోట్ లో ఉగ్రకుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. లైన్ ఆఫ్ కంట్రోల్ గుండా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను మన ఆర్మీ మట్టుబెట్టింది. ఈ ఎన్ కౌంటర్ లో హతమైన టెర్రరిస్టుల నుంచి ఏకే సిరీస్ కు చెందిన రెండు ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు చైనాలో తయారైన రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. చైనా మేడ్ ఎం16 రైఫిల్ పాకిస్తాన్ ఉగ్రవాదుల దగ్గర దొరకడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.

ముఖ్యంగా రెండు అనుమానాలు ఆర్మీ అధికారుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. చైనా తన ఆయుధాలను పాకిస్తాన్ సైన్యానికి అందిస్తే, వాటిని పాక్ ఆర్మీ ఉగ్రవాదులకు ఇస్తోందా? లేక డ్రాగనే నేరుగా ఉగ్రవాదులకు ఆయుధాలు సప్లయ్ చేస్తూ టెర్రరిజానికి మద్దతు ఇస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వారి దగ్గరికి మేడిన్ చైనా ఎం16 రైఫిల్స్ ఎలా వచ్చాయి అనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. వీటిలో ఏది నిజమై ఉంటుంది అనేది తేల్చే పనిలో పడ్డారు అధికారులు.

సాధారణంగా ఎప్పుడు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో హతమైనా వారి దగ్గర ఏకే సిరీస్ ఆయుధాలు దొరుకుతుంటాయి. చాలా అరుదుగా టెర్రరిస్టుల నుంచి ఎం16 రైఫిల్స్ స్వాధీనం చేసుకుంటారు. కానీ, ఈసారి దొరికిన ఎం16 చైనాలో తయారు చేసింది కావడం ఆందోళన రేపుతోంది. ఇది పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకు మధ్య బంధానికి సంకేతంగా చెబుతున్నారు.

అంతేకాదు బోర్డర్ లో రికార్డ్ అయిన ఫుటేజీల ప్రకారం దాదాపు 100 నుంచి 120 మంది టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు.

ఇక నియంత్రణ రేఖక అవతల టెర్రరిస్టులు 15 నుంచి 20 లాంచ్ ప్యాడ్ లను తయారు చేశారు. ఇవి ఎల్వోసీకి చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి ఉన్నప్పటికీ లాంచ్ పాడ్ లో ఉగ్రవాదుల ఉనికి, చొరబాటుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఉగ్రకుట్రలను భారత ఆర్మీ భగ్నం చేస్తుండటంతో పాకిస్తాన్ కు మైండ్ బ్లాంక్ అవుతోంది. అయినప్పటికీ ఉగ్రవాదులు చొరబడి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో భారత సైన్యం బోర్డర్ లో ఎంతో అలర్ట్ గా ఉంది.

నియంత్రణ రేఖ వెంబడి గత మూడు రోజుల్లో మూడుసార్లు చొరబడేందుకు ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు. ఇటీవలే ఉగ్రవాద సంస్థల ప్రోద్బలంతో భారత్ లో దాడులు చేసేందుకు ప్రయత్నించిన ఓ టెర్రరిస్టును రష్యాలో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఉగ్రవాదుల చొరబాట్లను ఇండియన్ ఆర్మీ గుర్తించింది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి.