ఎలుకకు గోల్డ్ మెడల్..!! PDSA మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన మూషికం

  • Edited By: nagamani , September 26, 2020 / 11:48 AM IST
ఎలుకకు గోల్డ్ మెడల్..!! PDSA మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన మూషికం

కాంబోడియాలోని ఓ ఎలుకకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఓ ఎలుక గోల్డ్ మెడల్ సాధించింది. ఈ పతకం పేరు ‘పీడీఎస్ఏ’ గోల్డ్ మెడల్. ఇప్పటివరకు ఈ మెడల్‌ను 30 జంతువులకు ఇచ్చారు. కానీ..గోల్డ్ మెడల్ గెలుచుకున్న మొదటి ఎలుక ఇదే కావడం విశేషం. ఎలుక జాతికే ఆణిముత్యంలా నిలిచి చరిత్ర సృష్టించిన ఈ ఎలుక పేరు ‘మగావా’. ఇంతకీ ఎలుక ఏంటీ దానికి గోల్డ్ మెడల్ ఇవ్వటమేంటీ అనే పెద్ద సందేహం వచ్చే ఉంటుంది. ఓ ఎలుకను బంగారు పతకంతో గౌరవించారు అంటే దాని ప్రతిభ పాటవాలేంటో తెలుసుకోవాల్సిందే.


ఆఫ్రికాకు చెందిన ఈ ఎలుక పోలీస్ జాగిలాల వలెనే గొప్ప పని చేసింది. కాంబోడియాలోని భూముల్లో దుండగులు పాతిపెట్టిన లాండ్‌మైన్లను కనిపెట్టడంలో ఈ ఎలుక అత్యంత ప్రతిభ కనబరిచింది. ఏడేళ్లలో ఏకంగా మగావా 39 ల్యాండ్‌మైన్లు, 28 పేలుడు పదార్థాలను కనిపెట్టింది. మనుషుల ప్రాణాలు కాపాడటంలో సేవలందించిన మగావాను బంగారు పతకంతో సత్కరించారు.


పీడీఎస్ఏ గోల్డ్ మెడల్ అందుకున్న మొట్టమొదటి ఎలుక మగావానే. బెల్జియం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ల్యాండ్‌మైన్లను కనుగొనడంలో మగావాకు అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ తీసుకునే సమయంలో మగావా చాలా త్వరగా అన్నింటినీ గ్రహించి చురుగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో తన ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది.


కాంబోడియాలో డ్యూటీ చేస్తూ ప్రమాదకర ల్యాండ్‌మైన్‌లను గుర్తించి పోలీసుల ప్రాణాలతో పాటు సామాన్యుల ప్రాణాలను కూడా కాపాడిన మగావాను సేవలను అధికారులు గుర్తించారు. బంగారు పతకాన్ని ఇచ్చి గౌరవించారు. మగావా ఎలుక వయసు ఇప్పుడు 7 ఏళ్లు. బెల్జియం దేశానికి చెందిన అపోపో చారిటీ సంస్థ ఎలుకలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది.


ఈ మగావాకు కూడా అపోపో చారిటీసంస్థ చక్కటి ట్రైనింగ్ ఇచ్చింది. ఇలా సేవలు అందించే ఎలుకల్ని ‘హీరో రాట్స్’ అనే పేరుతో సమాజ సేవ కోసం పోలీసు బలగాలకు పంపిస్తారు. 1990ల నుంచి ఈ సంస్థ ఎలుకలను ట్రైన్ చేస్తోంది. కాగా మగావా ఎలుక పేరు మీద అపోపో చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టాఫ్ కొక్స్ పతకాన్ని అందుకున్నారు.


మగావా అందించిన సేవలకు గానీ మా సంస్థ నుంచి ఈ పతకాన్ని అందుకోవటం మేము గౌరవంగా భావిస్తున్నామని అపోపో చారిటీ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టోఫ్ కాక్స్ మీడియాకు తెలిపారు. కంబోడియా ప్రజలకే కాదు ల్యాండ్ మైన్ల సమస్య ఉన్న ప్రతీ ప్రాంతానికి మగావా లాంటి ఎలుకలు చాలా అవసరమని అన్నారు.