ఇకపై ఇండియాలో ఇంచు భూమి కూడా వదలం.. కాస్కో

ఇకపై ఇండియాలో ఇంచు భూమి కూడా వదలం.. కాస్కో

ఇప్పటివరకు చేసిన పొరపాట్లు.. కోల్పోయిన భూభాగం చాలు.. ఇకపై ఇంచు భూమి కూడా దురాక్రమణ జరగటానికి వీల్లేదు. ఇకపైనా.. సరిహద్దులను కాపాడుకోవడమే భారత్ టార్గెట్. అందుకే.. పాంగాంగ్ దగ్గర పట్టు బిగిస్తోంది ఇండియన్ ఆర్మీ. దేశ భద్రత, రక్షణే లక్ష్యంగా.. డ్రాగన్ కన్నా ఎత్తులో బలగాలను మోహరిస్తోంది. చైనా ఎత్తులకు.. పై ఎత్తులు వేస్తూ.. కమ్యూనిస్ట్ కంట్రీకి.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

భారత్-చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగేందుకు కారణం.. ఈస్ట్ లద్దాఖ్‌లోని పాంగాంగ్ లేక్. తాజా సరిహద్దు ఘర్షణలకు.. పాంగాంగ్ సరస్సే.. సెంటర్ పాయింట్‌గా ఉంది. ఇప్పటికీ అక్కడ.. రెండు దేశాల ఆర్మీ మధ్య సెగలు రేగుతూనే ఉన్నాయ్. గత నెల 29న అర్ధరాత్రి.. పాంగాంగ్ సౌత్ బ్యాంక్‌ని చేజిక్కించుకునేందు డ్రాగన్ ట్రై చేసి.. ఫెయిలైంది.

సైన్యంలోని వివిధ దళాలను పాంగాంగ్:
చైనా కంటే ముందే.. బ్లాక్ టాప్ హిల్‌ని, పాంగాంగ్ సౌత్ బ్యాంక్‌ని.. తన ఆధీనంలోకి తెచ్చేసుకుంది. చైనా చేసిన దుస్సాహసంతో.. భారత్ అప్రమత్తమైంది. పాంగాంగ్ లేక్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేసింది. లద్దాఖ్‌లోని 1597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ దగ్గర.. సరిహద్దు నిర్వహణ మాత్రమే చేపట్టే భారత్.. ఇప్పుడు సరిహద్దు రక్షణకు దిగింది. ఇందుకనుగుణంగా.. సైన్యంలోని వివిధ దళాలను పాంగాంగ్ లేక్ దగ్గర మోహరించింది.

కొన్ని చోట్ల బలగాల స్థానాల్లో మార్పులు చేసింది. డ్రాగన్ కంట్రీ.. ఎలాంటి దుస్సాహసానికి దిగినా.. సరిహద్దును కాపాడుకునేలా పటిష్ట వ్యూహాన్ని రెడీ చేసింది. చైనా దూకుడు చర్యలను పరిగణనలోకి తీసుకొని.. ఎట్టిపరిస్థితుల్లోనూ.. అన్ని ప్రదేశాలను కాపాడుకునేలా.. స్కెచ్ గీసింది ఇండియన్ ఆర్మీ.

చైనా ఎత్తును.. చిత్తు చేస్తూ
చైనా ఎత్తును.. చిత్తు చేస్తూ పాంగాంగ్ లేక్ దక్షిణ తీర ప్రాంతంలో ఎత్తైన వ్యూహాత్మక ప్రాంతాలను.. భారత్ ఇప్పటికే స్వాధీనం చేసేసుకుంది. ఇప్పుడు కూడా ఆ పట్టు సడలకుండా గట్టిగా బిగిస్తోంది. పాంగాంగ్ ఉత్తర తీరంలోని.. కీలకమైన ఫింగర్-4 పర్వతాలు చైనా కబ్జాలో ఉన్నాయి. ఐతే.. ఆ ఫింగర్ ప్రాంతంలోనూ.. ఇతర పర్వత శిఖరాలను ఆకస్మికంగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా డ్రాగన్‌పై భారత్ ప్రెజర్ పెంచింది.

దీనివల్ల.. భవిష్యత్‌లో చర్చలు జరిపేటప్పుడు.. భారత్‌కు అనుకూల పరిస్థితి ఉంటుందని.. సైనిక వర్గాలు భావిస్తున్నాయ్. ఎల్ఏసీ వెంట.. చైనా బలగాలను మోహరిస్తుండటంతో.. భారత్ కూడా దీటుగా స్పందిస్తోంది. చైనా కోసమే ప్రత్యేకంగా సిద్ధం చేసిన.. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ సహా.. అనేక దళాలను రంగంలోకి దించింది. దెప్సాంగ్ మైదాన ప్రాంతాల్లో.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన బ్రిగేడ్‌ని మోహరించింది. దీంతో.. భారత్ యుద్ధ ట్యాంకులు, బలగాలను గ్రౌండ్ జీరోలోకి దించింది.

డ్రాగన్‌కు సంకేతాన్ని
చుమార్ ప్రాంతంలోనూ.. భారత్ సైన్యాన్ని మోహరించింది. వీటిన్నింటితో.. సరిహద్దులను రక్షించుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందన్న సంకేతాన్ని డ్రాగన్‌కు ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. ఇప్పుడు దెమ్ చోక్, చుమార్ ప్రాంతంలో.. భారత్‌దే పైచేయిగా ఉంది. చైనాకు చెందిన లాసా-కష్గర్ హైవేపై.. ఆ దేశం సాగిస్తున్న సైనిక తరలింపులను.. ఎత్తైన ప్రాంతాల నుంచి మన సైన్యం క్లియర్‌గా గమనిస్తోంది.

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో.. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్‌ కూడా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇప్పటికే ఎస్‌ఎస్‌బీ దళాలను అరుణాచల్‌ ప్రదేశ్‌, భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లోకి తరలించినట్లు సమాచారం. సిక్కింలో భారత్‌, చైనా, టిబెట్‌ సరిహద్దులు కలిసే.. ట్రై జంక్షన్‌ ప్రాంతంలోనూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

చైనాతో సరిహద్దు వివాదాన్ని:
చైనా దూకుడు చర్యలకు.. దీటుగా స్పందించే సత్తా భారత సైనిక దళాలకు ఉందని సీడీఎస్ బిపిన్‌ రావత్‌ చెప్పారు. దేశం ఇప్పుడు ముప్పు, సవాళ్లను ఎదుర్కొంటోందని.. పూర్తిస్థాయి అణు యుద్ధం నుంచి సంప్రదాయేతర యుద్ధం వరకు అనేక సవాళ్లు పొంచి ఉన్నాయని తెలిపారు. వాటిని ఎదుర్కొనేందుకు భారత సైనికదళాలు సన్నద్ధంగా ఉన్నాయన్నారు రావత్. చైనాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని అవకాశంగా మలచుకొని.. పాకిస్థాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా కూడా తూర్పు విభాగంలోని కీలకమైన ఎయిర్‌బేస్‌లను ఇప్పటికే సందర్శించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని ఎల్‌ఏసీ వెంబడి.. ఎయిర్‌ఫోర్స్ సన్నద్ధతపై రివ్యూ చేశారు. ఇప్పటికే.. ఐఏఎఫ్ సుఖోయ్‌-30 ఎంకేఐ, జాగ్వార్‌, మిరాజ్‌-2000 లాంటి.. ఫైటర్ జెట్స్, అపాచీ, చినూక్ హెలికాప్టర్లను సరిహద్దుల్లో మోహరించింది.