Google Maps : కొంపముంచిన గూగుల్.. ఏకంగా పెళ్లి కూతురే మారిపోయింది, చివరి నిమిషంలో తప్పిన ప్రమాదం

ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్లాల్సి వస్తే ఏం చేస్తాం.. ఎవరో ఒకరిని అడిగి తెలుసుకుని వెళ్లేవాళ్లం. రోడ్డు మీద వెళ్లేవారినో స్థానికులనో లేక బంధువులనో అడిగి ముందుకు వెళ్లేవాళ్లం. ఇది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ వచ్చేసింది. గూగుల్ మ్యాప్స్ పుణ్యమా అని అడుక్కునే బాధ తప్పింది. ఎంచక్కా స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఆన్‌చేసుకుని ఎవరినీ అడగకుండానే మనం వెళ్లాల్సిన ప్రదేశానికి వెళ్లిపోతున్నాం. అత్యాధునిక సాంకేతికత జీవితాలను హాయిగా మార్చేసిందని అంతా సంబర పడుతున్నాం. అదే సమయంలో.. ఆ టెక్నాలజీ ఒక్కోసారి కష్టాలను కూడా తెచ్చిపెడుతోంది. అందుకు నిదర్శనమే ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటన.

Google Maps : కొంపముంచిన గూగుల్.. ఏకంగా పెళ్లి కూతురే మారిపోయింది, చివరి నిమిషంలో తప్పిన ప్రమాదం

Google Maps

Google Maps : ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్లాల్సి వస్తే ఏం చేస్తాం.. ఎవరో ఒకరిని అడిగి తెలుసుకుని వెళ్లేవాళ్లం. రోడ్డు మీద వెళ్లేవారినో స్థానికులనో లేక బంధువులనో అడిగి కరెక్ట్ అడ్రస్ కి చేరుకునే వాళ్లం. ఇది ఒకప్పుడు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ వచ్చేసింది. గూగుల్ మ్యాప్స్ పుణ్యమా అని అడుక్కునే బాధ తప్పింది. ఎంచక్కా స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఆన్‌చేసుకుని ఎవరినీ అడగకుండానే మనం వెళ్లాల్సిన అడ్రస్ కి వెళ్లిపోతున్నాం. అత్యాధునిక సాంకేతికత జీవితాలను హాయిగా మార్చేసిందని అంతా సంబర పడుతున్నాం. అదే సమయంలో.. ఆ టెక్నాలజీ ఒక్కోసారి కష్టాలను కూడా తెచ్చిపెడుతోంది. మరీ గుడ్డిగా గూగుల్ మ్యాప్స్ ని నమ్మకూడదు.  అందుకు నిదర్శనమే ఇండోనేషియాలో జరిగిన ఈ ఘటన.

రాంగ్ అడ్రస్ కి వెళ్లిన పెళ్లికొడుకు:
గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకుని, పెళ్లింటి చిరునామా వెతుక్కుంటూ వెళ్లిన వరుడు.. అదే ప్రాంతంలోని మరో వధువు చెంతకు చేరుకున్నాడు. ఇక పెళ్లే తరువాయి అనుకునేంతలోనే తాము వచ్చింది వేరొకరి ఇంటికని తెలుసుకొని నాలుక్కరుచుకున్నారు. ఇండోనేషియాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. సెంట్రల్‌ జావాలోని లొసారి హామ్లెట్‌లో వధువు ఇంటికి బయలుదేరిన వరుడు, అతని బంధువులు గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు.

ఒక చోట పెళ్లి, మరో చోట ఎంగేజ్ మెంట్:
అది అక్కడికి సమీపంలోనే ఉన్న జెంగ్‌కోల్‌ హామ్లెట్‌ అనే మరో గ్రామానికి తీసుకెళ్లింది. అక్కడా ఓ పెళ్లిమండపం, హడావుడి ఉండటంతో సరాసరి అందులోకి వెళ్లారు. నిజానికి అక్కడ మారియా అనే అమ్మాయికి బుర్హాన్‌తో అనే యువకుడితో నిశ్చితార్థం జరగాలి. వారంతా బుర్హాన్‌ బంధువుల కోసం చూస్తుండగా.. ‘‘గూగుల్‌ బృందం’’ వచ్చేసింది.

వచ్చిన వారు నిశ్చితార్థం కోసం వచ్చిన వారని భావించి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. అతిథి మర్యాలు చేశారు. కాసేపు అంతా సవ్యంగానే జరుగుతోందని అందరూ అనుకున్నారు. అయితే ఏకంగా పెళ్లి దుస్తులు, సరంజామాతో వచ్చిన వారిని చూసి మారియా అప్రమత్తమైంది. వచ్చిన వారు తన కోసం వచ్చిన వారు కాదని గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. వచ్చిన వారు కూడా తాము మరో చోటకు వచ్చినట్టు గుర్తించి కంగుతిన్నారు. ఆ తర్వాత తమ సరంజామా సర్దుకుని అక్కడి నుంచి బయలుదేరి అసలైన పెళ్లి మండపానికి వెళ్లారు.

నవ్వులే నవ్వులు..
ఈ ఘటన నవ్వులు పూయించింది. జరిగింది తలుచుకుని పెళ్లి బృందం వారు, మారియా కుటుంబసభ్యులు కడుపుబ్బా నవ్వుకున్నారు. కాగా, బుర్హాన్ కుటుంబసభ్యులు దారిలో టాయ్ లెట్ కోసం ఆగడంతో వారి రాక ఆలస్యమైందని మారియా తెలిపింది. మండపంలోకి వచ్చిన పెళ్లి బృందం వారిని చూసి తాను షాక్ తిన్నాను అని చెప్పింది. ఆ బృందంలోని వారిలో ఒక్కరూ కూడా తనకు తెలియదంది. పెళ్లి కోసం వచ్చిన వారు కెందాల్ నుంచి రాగా, నిశ్చితార్థం కోసం రావాల్సిన వారు పెమలాంగ్ వాసులు అని తెలిపింది. అసలు విషయం తెలిశాక అంతా కాసేపు షాక్ లో ఉండిపోయారు. ఆ తర్వాత పెళ్లి మండపానికి ఎలా వెళ్లాలో దారి చెప్పి పెళ్లి బృందం వారికి తన కుటుంబసభ్యులు సాయం చేశారని మారియా వెల్లడించింది.

అదండి.. మరీ ఎక్కువగా, గుడ్డిగా దేనిమీదా ఆధార పడకూడదని మన పెద్దలు ఊరకే అనలేదు. మరీ ముఖ్యంగా టెక్నాలజీని బ్లైండ్ గా నమ్ముకోవడానికి అస్సలు వీల్లేదు. అప్పుడప్పుడు కాస్త బుద్ది, జ్ఞానం, తెలివి తేటలు కూడా వాడాల్సిందే. లేదంటే చిక్కులు తప్పవు.