బ్రిటన్ లో జార్జి ఫ్లాయిడ్ ఘటన : మెడపై మోకాలు పెట్టి..

  • Published By: madhu ,Published On : July 19, 2020 / 12:37 PM IST
బ్రిటన్ లో జార్జి ఫ్లాయిడ్ ఘటన : మెడపై మోకాలు పెట్టి..

జార్జి ఫ్లాయిడ్ ఘటనపై అమెరికాలో ఇప్పటికీ నిరసనలు కొనసాగుతుండగా… అలాంటి ఘటనే బ్రిటన్‌లోనూ చోటు చేసుకుంది. మారణాయుధాన్ని కలిగి ఉన్నాడనే కారణంతో 45ఏళ్ల ఓ నల్లజాతి వ్యక్తిని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే అరెస్ట్ సమయంలో ఓ అధికారి.. Marcus Coutain నల్లజాతి వ్యక్తిని కింద పడేసి మెడపై మోకాలుపెట్టి హల్‌చల్ చేశాడు. ఈ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్‌గా మారింది.

దీంతో స్పందించిన ఉన్నతాధికారులు.. అమానుషంగా ప్రవర్తించిన పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. మరొకరిని విధుల నుంచి తొలగించారు.

మరోవైపు…అమెరికాలో బ్లాక్‌ లైవ్స్‌ మేటర్ ఉద్యమం ఆగడం లేదు. పోలీసుల క్రూరత్వానికి. జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొద్దిరోజులుగా శాంతియుతంగా జరుగుతున్న ఈ నిరసనలు ఇప్పుడు హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా.. పోర్ట్‌ల్యాండ్‌లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో… వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. పలువురిని అరెస్ట్ చేశారు.

చికాగోలోనూ బ్లాక్‌లైవ్స్‌మ్యాటర్‌ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. నిరసనకారులు తమ ఆగ్రహాన్ని విగ్రహాలపై చూపిస్తున్నారు. బానిసత్వాన్ని ప్రోత్సహించినవారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా చికాగోలోని క్రిస్టఫర్‌ కొలంబస్‌ విగ్రహంపైనా దాడి చేశారు. విగ్రహాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అయితే… వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో… పోలీసులు పలువురిని అరెస్ట్‌ చేశారు.