Lottery Ticket : డబుల్ అదృష్టవంతుడు.. పోగొట్టుకున్న రూ.8కోట్ల లాటరీ టికెట్ మళ్లీ దొరికింది

అతడు నిజంగా అదృష్టవంతుడు అనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నక్కతోక తొక్కాడని అనొచ్చు. లక్ష్మీదేవి కటాక్షం పొందాడని అనుకోవచ్చు. పోగొట్టుకున్న లాటరీ టికెట్..

Lottery Ticket : డబుల్ అదృష్టవంతుడు.. పోగొట్టుకున్న రూ.8కోట్ల లాటరీ టికెట్ మళ్లీ దొరికింది

Man Lost Lottery Ticket : అతడు నిజంగా అదృష్టవంతుడు అనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నక్కతోక తొక్కాడని అనొచ్చు. లక్ష్మీదేవి కటాక్షం పొందాడని అనుకోవచ్చు. పోగొట్టుకున్న లాటరీ టికెట్ మళ్లీ దొరకడం అంటే మామూలు విషయం కాదుగా మరి. అసలే ఆ లాటరీ టికెట్ విలువ అక్షరాల రూ.8కోట్లు. లాటరీ తగలడం ఒక లక్ అయితే, దాన్ని ఎక్కడో పోగొట్టుకుని, తిరిగి పొందడం మరో లక్కే. మనది అని రాసి పెట్టి ఉండాలే గానీ, దక్కక మానదు అనేందుకు ఉదాహరణ అమెరికాలో జరిగింది. ఓ వ్యక్తి లాటరీలో 1.2 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 8.67 కోట్లు) గెలుచుకున్నాడు. కాగా, ఆ టికెట్‌ పోగొట్టుకున్నాడు. అదృష్టం బాగుండి పోయిన టికెట్‌ దొరికింది.

అమెరికాలోని టేనస్సీ రాష్ట్రానికి చెందిన నిక్ స్లాటెన్ (31) మార్చి 10న డ్రింక్ తాగేందుకు గ్రాసరీ స్టోర్‌ కి వెళ్లాడు. అదే సమయంలో లాటరీ టికెట్ కొన్నాడు. మరుసటి రోజు ఉదయం… స్లాటెన్‌ తీసుకున్న టిక్కెట్టు లాటరీలో ఎంపికైంది. దానికి రూ.8కోట్ల ప్రైజ్ మనీ వచ్చింది. దీంతో నిక్ ఆనందానికి అవధులు లేవు. ఈ విషయాన్ని అతడు తన భార్యకు చెప్పాడు. ఆ తర్వాత తాను గెలుచుకున్న లాటరీ టికెట్ తీసుకెళ్లి నగదు బహుమతిని తెచ్చుకుందామని రెడీ అయ్యాడు. ఈలోపు, లాటరీ టిక్కెట్‌ కనిపించకుండా పోయింది. దీంతో నిక్‌ నిరాశలో మునిగిపోయాడు.

అదృష్టం ఇలా తలుపు తట్టినట్టే తట్టి అలా వెళ్లిపోయిందని నిక్ తెగ బాధపడ్డాడు. టికెట్‌ కోసం ఇళ్లంతా వెతికినా లాభం లేకపోయింది. కానీ అతని లక్కు కాసేపటికే కంటపడింది. పోగొట్టుకున్న లాటరీ టికెట్‌.. అదృష్టంకొద్ది తాను వెళ్లే దారిలో దొరికింది. పార్కింగ్ ఏరియాలో తన కారు పక్కనే ఉన్న మరో కారు దగ్గర నేల మీద పడున్న లాటరీ టికెట్ కనిపించింది. దీంతో నిక్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా ఒక్క రోజు వ్యవధిలోనే జరిగింది.

లాటరీలో వచ్చిన డబ్బుతో కొత్త ఇంటిని కొంటానని నిక్ చెప్పాడు. అలాగే కొత్త కారు కొంటానన్నాడు. డబ్బుని పెట్టుబడిగా పెడతానన్నాడు. అయితే డబ్బు వచ్చినా.. తాను తన భార్య పని చెయ్యడం మాత్రం ఆపబోమన్నాడు.