మసూద్ అజర్ చచ్చాడు : సోషల్ మీడియాలో వైరల్ న్యూస్

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 12:23 PM IST
మసూద్ అజర్ చచ్చాడు : సోషల్ మీడియాలో వైరల్ న్యూస్

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ చనిపోయాడా? ఫిబ్రవరి 26న భారత వాయుసేన జరిపిన దాడుల్లో మసూద్ ఖతమ్ అయ్యాడా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్  న్యూస్‌గా మారింది. మసూద్ అజర్ చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 26న బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ  దాడుల్లో జైషే ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయ్యాయి. 300మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. వీరిలో జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్ కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

#MasoodAzharDead అనే ట్యాగ్‌‌తో ఓ పోస్టు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. సర్జికల్ స్ట్రయిక్స్‌లో మసూద్ అజర్ తీవ్రంగా గాయపడ్డాడని, పాక్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించాడని  చెబుతున్నారు. మసూద్ అజర్ చనిపోయాడని, అతడిది నేచురల్ డెత్ అని త్వరలో పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని నెటిజన్లు అంటున్నారు. కాగా, కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మసూద్.. శనివారం(మార్చి-2-2019) మరణించినట్లు జాతీయ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. మసూద్ మృతిని పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మరి కారణం ఏం చెబుతుందో చూడాలి.

జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషీ ఇటీవలే అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగోలేదని… ఆర్మీ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నాడని, డయాలసిస్ చేయించుకుంటున్నాడని ఖురేషీ చెప్పారు. భారత వైమానిక దాడుల్లో మసూద్ తీవ్రంగా గాయపడి చనిపోయి ఉంటాడని, దాన్ని కవర్ చేసుకునేందుకు పాక్ మంత్రి ఇలా చెప్పి ఉంటారనే అనుమానాలూ లేకపోలేదు. ఉగ్రదాడుల సూత్రధారి మసూద్ చచ్చిన వార్తను పాక్ ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ ధృవీకరిస్తే ఎలాంటి కారణం చెబుతుందో చూడాలి.

మరోవైపు సర్జికల్‌ దాడులతో ఎలాంటి నష్టం జరుగలేదని పాక్ చెబుతున్న మాటలు తప్పని రుజువయ్యాయి. తమపై భారత ఎయిర్‌ఫోర్స్ మెరుపుదాడులు చేసింది నిజమేనని స్వయంగా జైషే చీఫ్‌  మసూద్‌ అజర్‌ తమ్ముడు మౌలానా అమర్‌ వెల్లడించాడు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగిన మరుసటి రోజున జైషే సీనియర్లతో జరిగిన సమావేశంలో అమర్‌ మాట్లాడినట్టు ఓ ఆడియో షోషల్‌ మీడియా  చక్కర్లు కొడుతోంది. ”బాలాకోట్‌లోని జైషే క్యాంపులపై వైమానిక దాడులు జరిగింది నిజమే. అయితే, మార్కజ్‌ (జిహాద్‌ బోధనా కేంద్రం)పై మాత్రమే దాడులు జరిగాయి. భారత్‌ చెబున్నట్టు జైషే  కీలక స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదు. మా భూభాగంలోకి వచ్చి మరీ జిహాద్‌ బోధనా కేంద్రంపై భారత్‌ దాడులకు దిగడం తీవ్ర వేదనకు గురిచేసింది. దీంతో ప్రతీకారానికి భారత్‌ మంచి  అవకాశం ఇచ్చింది. మాపై దాడి చేసి యుద్ధానికి కాలు దువ్వింది” అని అమర్ అనడంలో ఆ క్లిప్‌లో ఉంది.