Prince Harry ‘Spare’ Kohinoor Diamond : ప్రిన్స్ హ్యరీ పుస్తకంలో ‘కోహినూర్‌ డైమండ్‌’ ప్రస్తావన ..‘స్పేర్’‌లో హ్యారీ ఏం చెప్పారంటే..

కోహినూర్ డైమండ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అది మనదే అనే మాట భారత్ జాతి నోట వినిపిస్తుంది. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్ హ్యారీ రాసిన స్పేర్ పుస్తకంతో.. కోహినూర్‌ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. మన వజ్రం గురించి.. హ్యరీ తన పుస్తకంలో కోహినూర్ గురించి ప్రస్తావించటంతో మరోసారి కోహినూర్ డైమండ్ హాట్ టాపిక్ గా మారింది.

Prince Harry ‘Spare’ Kohinoor Diamond : ప్రిన్స్ హ్యరీ పుస్తకంలో ‘కోహినూర్‌ డైమండ్‌’ ప్రస్తావన ..‘స్పేర్’‌లో హ్యారీ ఏం చెప్పారంటే..

Prince Harry ‘Spare’ Kohinoor Diamond : ఇండియాలో ఎప్పుడు బ్రిటన్ ప్రస్తావన వచ్చినా.. రెండే రెండు విషయాలు గుర్తొస్తాయ్. ఒకటి.. 200 ఏళ్ల పాటు భారత్‌లో సాగిన బ్రిటీష్ వలస పాలన. రెండోది.. విలువ కట్టలేని
కోహినూర్ డైమండ్. ఈ వజ్రం.. ఓ దేశ దోపిడీకి సాక్ష్యం. మరో దేశ వైభవానికి, చరిత్రకు మూలం. చరిత్ర పేజీలు వెనక్కి తిరగేస్తే.. కోహినూర్ గురించి ఎన్నో కథలు, మరెన్నో కథనాలు..ఈ కోహినూర్ వజ్రం ధగధగల వెనుక రక్తసిక్తమైన రాజ్యాలు కనిపిస్తాయ్. కోహినూర్ డైమండ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అది మనదే అనే మాట భారత్ జాతి నోట వినిపిస్తుంది. ఈక్రమంలో బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్ హ్యారీ రాసిన స్పేర్ పుస్తకంతో.. కోహినూర్‌ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. మన వజ్రం గురించి.. హ్యరీ తన పుస్తకంలో ఏం చెప్పారు?

బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీ నుంచి బయటకొచ్చేసిన ప్రిన్స్ హ్యరీ.. ఈ మధ్యే ఓ పుస్తకం రాశాడు. దాని పేరు స్పేర్. అది.. విపరీతంగా సేల్ అవుతోంది. బ్రిటన్‌లో ఇప్పటిదాకా ఎక్కువగా అమ్ముడైన పుస్తకాలన్నింటి సేల్స్ రికార్డులను.. హ్యరీ స్పేర్ పుస్తకం బీట్ చేసేసింది. ఆ బుక్‌లో.. రాయల్ ఫ్యామిలీ గురించి, తన కుటుంబం గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి.. ఇలా అన్ని పాయింట్ టు పాయింట్ వివరంగా, ఎంతో ఆసక్తికరంగా రాసుకొచ్చారు ప్రిన్స్ హ్యారీ. అదే పుస్తకంలో.. కోహినూర్ డైమండ్ గురించి కూడా ప్రస్తావించారు హ్యారీ. అదే.. ఇప్పుడు ఇండియా వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. కోహినూర్ వజ్రాన్ని.. బ్రిటన్ కలిగి ఉండటంలో న్యాయ సమ్మతిని.. తన పుస్తకంలో ప్రశ్నించాడు హ్యరీ. ఇది.. మనకు, భారత ప్రభుత్వానికి సంతోషం కలిగించే విషయం. బ్రిటీష్ సామ్రాజ్యం.. పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు.. కోహినూర్ డైమండ్‌ని స్వాధీనం చేసుకుందని హ్యారీ తన పుస్తకంలో రాయటంతో మరోసారి ఈకోహినూర్ డైమండ్ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. తనకున్న ఆలోచన మేరకు.. బ్రిటీష్ గవర్నమెంట్.. కోహినూర్‌ని దొంగిలించిందని.. దాని గురించి మరిన్ని వివరాలు రాసుకొచ్చాడు. దాంతో.. మరోసారి కోహినూర్ డైమండ్‌పై చర్చ మొదలైంది.

మన గోల్కొండ సామ్రాజ్యంలో దొరికి.. ఎక్కడెక్కడో తిరిగి.. చివరకు బ్రిటన్ రాణి కిరీటంలో చేరిన కోహినూర్ వజ్రంపై.. దశాబ్దాలుగా వివాదం కొనసాగుతూనే ఉంది. భారత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సార్లు.. కోహినూర్ డైమండ్‌ని తిరిగి భారత్‌కు అప్పగించాలని.. బ్రిటన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా.. వాళ్లు పట్టించుకోలేదు. పైగా.. అది తమకు చెందిందే అని వాదిస్తున్నారు. అయితే.. కోహినూర్ ప్రస్తావన ఎప్పుడొచ్చినా.. ఎక్కడొచ్చినా.. దాన్ని తిరిగి భారత్‌కు తీసుకురావాలనే ప్రధానమైన డిమాండ్ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా.. ప్రిన్స్ హ్యరీ తన పుస్తకంలో కోహినూర్ డైమండ్‌ గురించి ప్రస్తావించడంతో.. మరోసారి అలాంటి డిమాండే వినిపిస్తోంది. ఇప్పుడు కాదు.. కొన్ని నెలల ముందు బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణించినప్పుడు కూడా ఇదే డిమాండ్ ప్రముఖంగా వినిపించింది. ఇప్పటికైనా.. వజ్రాన్ని భారత్‌కు తిరిగిచ్చేయాలనే వాదన బలంగా కనిపించింది.

కోహినూర్ వజ్రం తెలుగు వారి అమూల్య సంపద మాత్రమే కాదు.. భారతదేశంలో జరిగిన ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్ష్యం. కోహినూర్ అంటే కాంతి పర్వతమని అర్థం. 14వ శతాబ్దం మొదట్లో.. గోల్కొండ సామ్రాజ్యంలో ఇది దొరికినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడున్న గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లోనే.. కోహినూర్ బయటపడింది. తర్వాత.. ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్‌గా కీర్తి గడించింది. 12వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్య ఆనాటి కాకతీయ సామ్రాజ్యంలోని కృష్ణా నదికి ఒడ్డున ఉన్న కొల్లూరులో దొరికినట్లు మరో కథ ఉంది. అలా.. చరిత్రలో ఎంతో మంది రాజులు, చక్రవర్తుల చేతులు మారుతూ.. ఎన్నో వివాదాలకు కారణమైంది. చివరకు.. బ్రిటీష్ రాణి కిరీటంలో చేరింది.

కోహినూర్ వజ్రం దొరికినప్పుడు.. అది 186 క్యారెట్లుగా ఉంది. ఆనాటి వరంగల్ భద్రకాళి ఆలయంలో ఉంచారు. కాకతీయులను ఓడించిన తర్వాత అక్కడి నుంచి 1290లో ఢిల్లీ సుల్తానుల్లో ఒకరైన అల్లావుద్ధీన్ ఖిల్జీ దానిని సొంతం చేసుకున్నాడు. తర్వాత.. కోహినూర్ జర్నీకి సంబంధించిన చరిత్ర అస్పష్టంగా ఉంది. అయితే.. బ్రిటీష్ చరిత్రకారుడు బాంబర్ గ్యాస్‌కోయిన్.. 1526వ సంవత్సరంలో.. మొఘర్ రాజు హుమాయన్.. తన తండ్రి బాబర్‌కు దానిని సమర్పించాడని తెలిపాడు. అప్పుడు.. బాబర్ చక్రవర్తి.. 186 క్యారెట్ల బరువైన కోహినూర్ విలువను ఎలా లెక్కగట్టాడంటే.. ప్రపంచం మొత్తానికి రెండు రోజులు భోజనం పెట్టినంత అన్నాడని చరిత్ర చెబుతోంది. అంతేకాదు.. బాబర్ నామాలో కోహినూర్ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ.. ఆ వజ్రం విలువ.. యావత్ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుందని వర్ణించాడు. కొన్నేళ్ల తర్వాత.. హుమాయన్ తన అప్ఘాన్ ప్రత్యర్థి షేర్ షా చేతిలో ఓడిపోయాడు. భారత్ నుంచి తరిమేశాక.. ఆశ్రయం కోసం పర్షియాకు చెందిన షా తహ్మాస్‌కు.. కోహినూర్‌ను సమర్పించాడని చరిత్రకారులు చెబుతున్నారు. అలా.. చేతులు మారుతూ.. రక్తపు మరకలతో కూడిన ప్రయాణం చేసిన కోహినూర్.. 17వ శతాబ్దం ప్రారంభంలో.. మొఘల్ రాజు షాజహాన్ ఖజానాలోకి వచ్చి చేరింది. అతను.. దానిని 1635లో తన నెమలి సింహాసనంలో పొందుపరిచాడు. కొన్ని దశాబ్దాల తర్వాత.. 1738 నుంచి 39 మధ్యకాలంలో.. మొఘల్ రాజు మహ్మద్ షాను ఓడించిన తర్వాత.. అన్ని రకాల కెంపులు, పచ్చలు, వజ్రాలతో పాటు కోహినూర్ పొదిగిన అద్భుతమైన బంగారు నెమలి సింహాసనాన్ని.. పర్షియన్ రాజు నాదిర్ షా అధిష్టించాడు.

18వ శతాబ్దం ప్రారంభంలో నాదిర్ షా మనవడు షారోఖ్ షా.. అప్ఘాన్ సామ్రాజ్య స్థాపకుడు అహ్మద్ షా దురానీకి కోహినూర్‌ని బహూకరించడంతో.. కొన్నేళ్ల పాటు ఆ కుటుంబం దగ్గరే ఉండిపోయింది. తర్వాత.. దురానీ మనవడు, అప్ఘాన్ రాజు షా షుజా.. మహమూద్ షా చేతిలో ఓడిపోయాడు. లాహోర్ నుంచి బహిష్కరించడంతో.. పంజాబ్ రాజు అయిన మహారాజా రంజింత్ సింగ్‌ని శరణు కోరాడు. తనకు రక్షణ కల్పించినందుకు బహుమానంగా.. కోహినూర్‌ డైమండ్‌ని సమర్పించుకున్నాడు. 1849లో.. రాజా రంజిత్ సింగ్ మరణానంతరం.. సిక్కు సామ్రాజ్యాన్ని బ్రిటీష్ పాలకులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు కోహినూర్‌ను.. సర్ జాన్ లారెన్స్‌‌కు సమర్పించారు. అతను.. ఆరు వారాల పాటు తన జేబులోనే ఆ వజ్రాన్ని ఉంచుకున్నాడు. కొన్నాళ్లకు.. జాన్ లారెన్స్ భారత వైశ్రాయ్‌గా మారిన తర్వాత.. చిన్న వయసులోనే పట్టాభిషిక్తుడైన మహారాజా రంజిత్ సింగ్ కుమారుడు దులీప్‌సింగ్‌కు తిరిగి ఇచ్చాడు. తర్వాత.. అతని చేత క్వీన్ విక్టోరియాకు బహుమతిగా ఇప్పించాడు. అప్పటికే.. ఆల్బర్ట్ యువరాజు వజ్రానికి సానబెట్టిస్తే.. దానికోసం వాడిన 2 వేల వజ్రాలు అరిగిపోయాయ్. పైగా.. బరువు 105 క్యారెట్లకు పడిపోయింది. సానబెట్టిన కోహినూర్ వజ్రాన్ని.. బ్రిటన్ రాణి మళ్లీ సాన బెట్టించింది. అప్పుడు దాని కాంతి పెరగకపోగా.. నాణ్యత కూడా తగ్గింది. దాన్ని కిరీటంలో పొందుపరిచి.. బ్రిటన్ రాణులు ధరిస్తూ వస్తున్నారు.

కోహినూర్ వజ్రం.. ప్రపంచంలోనే అరుదైనది. అత్యద్భుతమైనది అయినప్పటికీ.. అది సృష్టించిన రక్తపాతం అంతా ఇంతా కాదు. ఆ వజ్రం ఎవరి చెంతకు చేరినా.. ఆ రాజ్యాలన్నీ నాశనమైపోయాయి. మొదటగా కాకతీయ సామ్రాజ్యాన్ని.. ఆ తర్వాత ఢిల్లీ ఖిల్జీ సుల్తానుల పీఠాన్ని, మొఘల్స్‌, పర్షియన్లను, అప్ఘాన్ సామ్రాజ్యాన్ని, చివరికి.. పంజాబ్ రాజా రంజింత్ సింగ్ రాజ్యాన్ని కూడా కూల్చింది. కోహినూర్ డైమండ్‌ని తమ దగ్గర ఉంచుకున్న ప్రతి మగవాడి రాజ్యం కుప్పకూలింది. వాళ్లూ.. చచ్చిపోయారు. కోహినూర్ బ్రిటీష్ రాణి కిరీటంలోకి చేరిన తర్వాత మాత్రం అది తన శాపాన్ని చూపించలేదు. కానీ.. రవి అస్తమించని సామ్రాజ్యంగా ప్రపంచం మొత్తాన్ని పాలించిన తెల్లదొరలు.. కోహినూర్‌ తమ ఖజానాకు వచ్చిన తర్వాత మాత్రం బ్రిటన్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.