Microplastics in breast milk : తల్లి పాలల్లో మైక్రో ప్లాస్టిక్ .. బిడ్డల ఆరోగ్యంపై శాస్త్రవేత్తల ఆందోళన
బిడ్డలో రోగ నిరోధక శక్తి పెంచే తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. కానీ ఆ తల్లిపాలు కూడా కల్తీ అవుతున్నాయా? అంటే నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. తల్లి పాలల్లో మైక్రో ప్లాస్టిక్ ను గుర్తించిన పరిశోధకులు బిడ్డల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Microplastics in breast milk : తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం అని డాక్టర్లు పదే పదే చెబుతుంటారు. మన పెద్దలు కూడా అదే చెప్పారు. ఎందుకంటే తల్లి పాలు కల్తీ ఉండదు. బిడ్డలో రోగ నిరోధక శక్తి పెంచే తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. కానీ ఆ తల్లిపాలు కూడా కల్తీ అవుతున్నాయా? అంటే నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. మరి బిడ్డల ఆరోగ్య పరిస్థితి ఏంటీ? అనే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు శాస్త్రవేత్తలు. తల్లి పాలల్లో ‘మైక్రో ప్లాస్టిక్’ఉందని ఇటలీ శాస్త్రవేత్తలు గుర్తించారు. మైక్రో ప్లాస్టిక్ కలిగిన పాలు తాగితే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కానీ తల్లిపాలల్లో మైక్రో ప్లాస్టిక్ ఉన్నప్పటికీ బిడ్డకు తల్లిపాలు పట్టటం మానవద్దని సూచిస్తున్నారు. మైక్రో ప్లాస్టిక్ తో కలిగే నష్టాల కంటే తల్లిపాల వల్ల అందే ప్రయోజనాలే ఎక్కువని అందుకు తల్లిపాలే బిడ్డలకు పట్టాలని సూచిస్తున్నారు.గర్భిణులు, తల్లులు ప్యాకేజ్డ్ ఫుడ్, ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
తల్లి పాలకు సంబంధించిన పరిశోధన.. జర్నల్ పాలిమర్స్‌లో ప్రచురితమైంది. తల్లి పాలల్లో పాలిథైలీన్, పీవీసీ, పాలిప్రొపిలీన్ వంటి ప్యాకేజింగ్‌లో వినియోగించే పదార్థాలను ఈ పరిశోధనలో కనుగొన్నారు. పరిశోధన కోసం ఇటలీ రోమ్‌లో.. 34మంది ఆరోగ్యవంతులైన తల్లుల బ్రెస్ట్ మిల్క్‌ని సేకరించారు. వీరందరు.. బిడ్డ పుట్టిన వారం రోజుల తర్వాత.. పాలను పరిశోధనకు ఇచ్చారు. వీటిల్లో 75శాతం మందిలో మైక్రోప్లాస్టిక్స్ పదార్థాలను గుర్తించారు పరిశోధకులు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
మైక్రోప్లాస్టిక్స్‌తో మానవ కణాలు, జంతువులు, వణ్యప్రాణుల్లో కలిగే నష్టాలను గతంలో ఎన్నో పరిశోధనలు బయటపెట్టాయి. ప్లాస్టిక్‌లో ఎన్నో కలుషిత పదార్థాలు ఉంటాయి. అవి ఇప్పుడు తల్లి పాలల్లో కూడా కనిపించాయని పరిశోధన పేర్కొంది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌తో కూడిన పదార్థాల్లోని ఆహారాన్ని సేవించడం, సీ ఫుడ్ తినడం, ప్లాస్టిక్‌తో కూడిన పర్సనల్ హైజీన్ ఉత్పత్తులు వినియోగించడానికి.. తల్లి పాలల్లో మైక్రోప్లాస్టిక్ ఉనికికి సంబంధం లేదని పరిశోధకులు అన్నారు. కానీ పర్యావరణంలోనే మైక్రోప్లాస్టిక్స్ ఉండటంతో మనిషికి ప్రమాదం అన్నారు. ఇటలీలోనే 2020లో.. మనిషి ప్లసెంటాలో మైక్రోప్లాస్టిక్ పదార్థాలను కనుగొన్నారు పరిశోధకులు. ఇక తాజా పరిశోధనతో.. తల్లి పాలల్లోకి కూడా మైక్రోప్లాస్టిక్ చేరిందని తేలింది.
“ప్రెగ్నెన్సీ, లాక్టేషన్లో ఈ కలుషితాన్ని తొలగించే పద్ధతులను ప్రవేశపెట్టడం కీలకం. తల్లి పాలల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నప్పటికీ.. వాటి కన్నా తల్లి పాలు పిల్లలకు అందకపోవడమే ఎక్కువ ప్రమాదకరం అన్నది అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తల్లి పాలు ఇవ్వకండి అని చెప్పడం మా పరిశోధన ఉద్దేశం కాదని..రాజకీయ నేతలు, చట్టసభ్యులు.. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు చట్టాలు తీసుకురావాలని మేము పిలుపునిస్తున్నామని ఇటలీ అన్కోనాలోని యూనివర్శిటీ పాలిటెక్నికా డెల్లె మార్చేకు చెందిన డా. వాలెంటీనా నోటర్సటెఫానో తెలిపారు.
దీనిపై మరింతగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని పుట్టబోయే బిడ్డలు..పుట్టిన బిడ్డల ఆరోగ్యం కోసం తల్లులు..గర్భిణులు జాగ్రత్తలుతీసుకోవాలని ప్లాస్టిక్ వినియోగంపై ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచించారు. బిడ్డలకు బాటిల్ పాలు మంచిది కాదని పైగా వాటి వల్ల మరింతగా ప్లాస్టిక్ వారి నోటిలోకి డైరోక్ట్ గా వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ప్లాస్టిక్ తో ప్యాక్ చేసిన ఆహారం, పానీయాలతో పాటు సౌందర్య ఉత్పత్తులు..అలాగే టూత్ పేస్టులు, సింథటిక్ ఫ్యాబ్రిక్ తో చేసే దస్తులు కూడా వినియోగించకుండా ఉంటే మంచిదని సూచించారు.