అదృష్టవంతుడు, రెండు రాళ్లతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయిన కూలీ

అదృష్టవంతుడు, రెండు రాళ్లతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయిన కూలీ

అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. సుడి ఉండాలే కానీ ఒక్క క్షణంలో లైఫ్ టర్న్ అయిపోతుంది. రాత్రికి రాత్రి కూలీ కూడా కోటీశ్వరుడైపోతాడు. టాంజానియాలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ కూలీ జాక్ పాట్ కొట్టాడు. రాత్రికి రాత్రి కరోడ్ పతీ అయ్యాడు. ఏదో లాటరీ తగిలి కాదు. రెండు పెద్ద రాళ్లు అతడిని కోటీశ్వరుడిని చేసేశాయి. రాళ్లు ఏంటి? కోటీశ్వరుడిని చేయడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. చూడటానికి అవి మమూలు రాళ్లలాగే ఉంటాయి. కానీ అవి అత్యంత విలువైన రత్నాలు. దీంతో అతడి సుడి ఒక్కసారిగా మారిపోయింది.

 

రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు:

టాంజానియాలో నివసించే 52 ఏళ్ల లైజర్ కు అదృష్టం మామూలుగా పట్టలేదు. రెండు రాళ్లు అతడిని ఓవర్ నైట్ లో కోటీశ్వరుడిని చేసేశాయి. టాంజానియా.. వజ్రాల గనులకు పేరొందిన తూర్పు ఆఫ్రికా దేశం. అక్కడి ప్రజలు తమ భూముల్లో దొరికే వజ్రాలను ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. దీంతో దాదాపు అందరూ ఇదే పనిలో ఉంటారు. మిరేరానీ ప్రాంతంలోని సిమాంజిరా జిల్లాకు చెందిన లైజర్ ఓ కూలీ. గనుల్లో పని చేస్తాడు. రోజూ తవ్వకాలు జరుపుతుంటాడు. ఈ క్రమంలో మంగళవారం(జూన్ 23,2020) అతడికి రెండు పెద్ద పెద్ద రాళ్లు దొరికాయి. చూడటానికి అవి మమూలుగా రాళ్లలాగే ఉన్నాయి. కానీ అవి అత్యంత విలువైన వజ్రాలు. దీంతో అతడి సుడి ఒక్కసారిగా మారిపోయింది.

 

రూ.25కోట్లకు రాళ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం:

ముంజేయి పరిమాణంలో ఉండే రెండు రత్నాల రాళ్లు దొరికాయి. వీటిలో మొదటి రత్నం బరువు 9.27 కిలోలు (20.4 పౌండ్లు) కాగా, రెండవ దాని బరువు 5.103 కిలోలు (11.25 పౌండ్లు) ఉన్నాయి. ముదురు వైలెట్-నీలం రంగులో ఉండే ఈ రత్నాలను అతని నుంచి ఆ దేశ ప్రభుత్వం దాదాపు 7.74 బిలియన్ టాంజానియన్ షిల్లింగ్స్‌కు కొనుగోలు చేసింది. అంటే వీటి ధర భారతదేశ కరెన్సీలో 25 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ రత్నాలను దేశంలోని ఉత్తరాన ఉన్న టాంజానిట్ గనులలో లైజర్ కనుగొన్నాడు.

 

మందు పార్టీ చేసుకుంటాడట, పిల్లలకు స్కూల్ కట్టిస్తాడట:

బుధవారం(జూన్ 24,2020) అందుకు సంబంధించిన మొత్తం అతడి ఖాతాకు బదిలీ కూడా చేసేసింది. ఈ సందర్భంగా టాంజానియా అధ్యక్షుడు జాన్ మాగుఫులి ఫోన్ చేసి లైజర్ ను అభినందించారు. ఇంత డబ్బు వచ్చింది కదా? ఏం చేస్తావని లైజర్ ను అడిగితే.. ముందు పెద్ద పార్టీ చేసుకుంటానని చెప్పాడు. తర్వాత తన ప్రాంతంలో ఉండే పిల్లల కోసం ఓ స్కూలు కట్టిస్తాడట. ఇక్కడి చాలామందికి తమ పిల్లలను చదివించే స్తోమత లేదని, అందువల్ల ఓ స్కూలు కట్టించి అందరూ ఉచితంగా చదువుకునే ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అలాగే ఓ షాపింగ్ మాల్ కూడా నిర్మిస్తానని వెల్లడించాడు.

రెండు అతిపెద్ద టాంజానిట్‌ రత్నాలను గుర్తించడం ఇదే తొలిసారి:

లైజర్ గనులు తవ్వుకుని జీవించే రోజూవారి కూలీ. అతను కష్టపడి గనులు తవ్వితేనే అతని కుటుంబ పోషణ సాగుతుంది. ఇలా శ్రమిస్తున్న సమయంలో ఒక్కసారిగా అతడి కష్టాలన్నీ తీరిపోయాయి. మిరేరానీలో మైనింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి రెండు అతిపెద్ద టాంజానిట్‌ రత్నాలను గుర్తించడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. తాను, తన కుటుంబం ఏ బాధా లేకుండా హాయిగా బతుకుతామని లైజర్ చెప్పాడు. కాగా, మైనింగ్‌ చేసేవారు తమ రత్నాలను, బంగారాన్ని ప్రభుత్వానికి విక్రయించడానికి టాంజానియా ప్రభుత్వం 2019లో దేశవ్యాప్తంగా వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. లైజర్ కు పట్టిన అదృష్టానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదృష్టవంతుడు, సుడిగాడు అనే బిరుదులతో నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read: కరోనా భయంతో ప్రెగ్నెన్సీ వాయిదా వేస్తున్న మహిళలు, స్టడీ